- త్వరలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు
- గ్రేటర్‌లో డీజిల్ బస్సులకు చెక్
- జిల్లాలకు తరలించనున్న ఆర్టీసీ
- ఇక హైదరాబాద్ అంతా పచ్చ బస్సులే
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : త్వరలో హైదరాబాద్ పరిధిలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో కాలుష్య నియంత్రణ వైపు అడుగులు పడుతున్నాయి. ఈవీ బస్సుల రాకతో గ్రేటర్‌లో ఉన్న డీజిల్ బస్సులను జిల్లాలకు పంపే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఢిల్లీవాసుల కష్టాలు హైదరాబాద్‌కు రాకుండా చేయాలనే ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్, మంత్రి పొన్నం ఇదివరకే స్పష్టం చేశారు. ఈవీ బస్సుల రాకతో మహిళా ప్రయాణికులకు సైతం మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని సర్కారు చెబుతోంది.
హైదరాబాద్‌లో ఇదీ పరిస్థితి
జీహెచ్‌ఎంసీ పరిధిలోకి సగటున ఏడాదికి ఐదు లక్షల కొత్త వాహనాలు వచ్చి చేరుతున్నాయి. ఫలితంగా ఏటా 6 నుంచి 8 శాతం అదనపు కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి. ఇంధన వినియోగం కూడా 8 నుంచి 10 శాతానికి పెరుగుతోంది. దీంతో కాలుష్యం పెరిగిపోయి ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతోంది.
హైదరాబాద్ కాలుష్యంపై ఐఐటీ కాన్పూర్, తెలంగాణ పీసీబీ సంయుక్తంగా చేసిన పరిశోధనలో పీఎం 10 కాలుష్య కారకాల కారణాలను కనుగొన్నారు. వాహనాల ద్వారా పీఎం10 (పర్టిక్యులర్ మ్యాటర్ 10) కాలుష్య కారకాలు 23 శాతం వెలువడుతున్నట్లు గుర్తించారు.
ఈవీ బస్సుల ద్వారా హైదరాబాద్‌లో ఏడాదికి పీఎం 2.5 స్థాయి 839.5 టన్నుల మేర తగ్గనుంది. అదేవిధంగా నగరంలోని నివాస ప్రాంతాల్లో శబ్ధస్థాయి పగటి పూట 65 డెసిబుల్స్ ఉంటే రాత్రిపూట 60 డెసిబుల్స్‌గా ఉంది. డీజిల్ వాహనాలతో పోలిస్తే ‘ఈవీ’లతో కనీసం 10 డెసిబుల్స్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఐదు గంటల్లో బ్యాటరీ ఫుల్..
నగరంలో ప్రస్తుతం నడుస్తున్న ఈవీ బస్సుల్లో 40 మంది ప్రయాణించేలా రూపొందించారు. లిథియం ఇయాన్ బ్యాటరీతో నడిచే ఈ బస్సులు.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 250 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తాయి. సుమారుగా 5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుందని ఈవీ బస్సుల నిర్వాహకులు చెబుతున్నారు. ఈవీ బస్సుల ద్వారా గాలి, వాయుకాలుష్యం రెండూ ఉండవు.
‘మహాలక్ష్మి’ రద్దీకి చెక్..
తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. సగటును రోజుకు 10లక్షల మందికి పైగా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీనికి తోడు పాత బస్సులు నడుపుతుండటంతో అవి మెరాయించటంతోపాటుగా.. భారీగా పొగ కక్కుతుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు రానుండడంతో ప్రయాణికుల వెతలు తీరనున్నాయి.
ఢిల్లీలో తగ్గిన కాలుష్యం..
ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న అన్ని పబ్లిక్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో కాలుష్య ఉద్గారాలలో 74.67 శాతం తగ్గించవచ్చని ఒక అధ్యయనం తెలిపింది. సీఎన్‌జీ ఆధారిత బస్సుల నుంచి విద్యుత్ ఆధారిత బస్సులకు మారడం వల్ల ఇంధన సామర్థ్యం, మెరుగైన గాలి, ప్రజారోగ్యం వంటి అనేక ఇతర ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
వాయుకాలుష్యంతో 17.8 శాతం మరణాలు
దేశంలో 17.8 శాతం మరణాలు వాయు కాలుష్యం ద్వారానే సంభవిస్తున్నాయి. ఇది ఏడాదికి దాదాపు 16.70 లక్షల మంది మరణాలకు కారణమవుతుందని బోస్టన్ కాలేజీలోని గ్లోబల్ అబ్జర్వేటరీ ఆన్ పొల్యూషన్ అండ్ హెల్త్ పరిశోధకుల అధ్యయనం తేల్చింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా, ఆగ్నేయాసియాపై గ్రీన్‌పీస్ 2021లో జరిపిన ఒక అధ్యయనంలో ఢిల్లీలోని పీఎం 2.5 ఉద్గారాల వల్ల 2020లో 54,000 మంది అకాల మరణాలు సంభవించాయని తేలింది.