27-03-2025 12:16:16 AM
పటాన్ చెరు, మార్చి 26 : తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొల్లూరులో ఏర్పా టు చేసిన డంపింగ్ యార్డు కాలుష్య కుంపటిగా మారింది. చెత్త తగలబడడంతో నిత్యం హానికర పొగలు వెలువడుతున్నాయి. దీంతో చుట్టు పక్కల నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. డంపింగ్ యార్డు చెత్త తగలబడి వెలువడుతున్న పొగలతో అనారోగ్యాలకు గురవుతున్నామని మోఖిల తాండ వాసులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
ఈ సమస్యపై పత్రికల్లో కథనాలు రాగా పీసీబీ అధికారులు పరిశీలించి వెళ్లారే తప్పా ఇప్పటి వరకు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. వివరాలలోకి వెళ్తే...తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని కొ ల్లూరు పరిధిలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం ఐదు ఎకరాల స్థలాన్ని గత ప్రభుత్వం కేటాయించింది. సుమారు రూ.కోటితో స్లడ్జ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను నిర్మించారు.
కాగా దీనిని ఇంత వరకు వినియోగంలోకి తీసుకురాలేదు. డంపింగ్ యార్డు లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం లేదు. వాస్తవానికి సేకరించిన వ్యర్థాల నుంచి తడి చెత్త, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా వేరు చేయాలి. ఇలా వేరు చేసిన చెత్తను కంపోస్ట్ గా మార్చాలి. కానీ ఇక్కడ ఇలా జరగడం లేదు. డంపింగ్ యార్డు చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు రబ్బర్, ఫైబర్ ఇతర పనికి రాని, పర్యావరణానికి హానికలిగించే వస్తువులు వేరు చేయడం లేదు. ఇవన్ని తగలబడి ప్రమాదకరమైన పొగలు వ్యాపిస్తున్నాయి.
ఇటీవల పత్రికల్లో వచ్చిన కథనాలతో డంపింగ్ యార్డును పరిశీలించిన పీసీబీ అధికారులు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోలేదు. డంపింగ్ యార్డ్ చెత్త తగలబడడంతో అందులో నుంచి వస్తున్న పొగలు సమీపంలో ఉన్న తాండ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తీవ్ర అవస్థలు, అనారో గ్యానికి గురవుతున్నారు. ఇటీవలే డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న పొగలతో పడుతున్న అవస్థలపై హైకోర్టను ఆశ్రయించారు.
డంపింగ్ యార్డులో కేవలం మున్సిపాలిటీకి చెందిన చెత్త ఒక్కటే కాకుండా బయట వ్యక్తులు కూడా చెత్తను తీసుకొచ్చి పారవేస్తున్నారు. నిర్మించిన డంపింగ్ యార్డులో వేయాల్సిన చెత్తను బయట కూడా వేస్తున్నారు. డంపింగ్ యార్డులోని చెత్త తగులబడి ప్రమాదకర విష వాయువులు వెలువడుతున్నాయని, వీటి వలన చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారు అవస్థలు పడుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు తెలిసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు తెలిపారు. తక్షణమే ఈ సమస్య నుంచి తమను కాపాడాలని కోరుతున్నారు.