calender_icon.png 25 September, 2024 | 10:04 PM

జమ్ముకశ్మీర్‌లో నేడు పోలింగ్

25-09-2024 04:19:00 AM

రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధం

26 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎలక్షన్స్

జమ్ముకశ్మీర్, సెప్టెంబర్ 24: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. బుధవారం 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశా రు.

సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 26 స్థానాలకు 239 మంది అభ్యర్థులు బరిలో నిలవగా దాదాపు 25.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరీ సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఎన్నికలు జరగనున్న 6 జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున బలగాలను మొహరించడంతో పాటు నిఘా పెంచా రు. జమ్ముకశ్మీర్‌లో సెప్టెంబర్ 18న 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన తొలివిడత పోలింగ్‌లో 61.38 శాతం ఓటింగ్ నమోదు కాగా బుధవారం రెండో విడత, అక్టోబర్ 1న చివరి విడత పోలింగ్ జరగనుంది. మొత్తంగా 90 నియోజకవర్గాల కు సంబంధించి అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. 

బరిలో ప్రముఖులు..

రెండో విడతలో జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ రైనా, జేఅండ్‌కే పీసీసీ చీఫ్ తారీఖ్ హమీద్, వేర్పాటువాద నాయకుడు బర్కతి తదితర ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఒమర్ బుద్గామ్, గందర్‌బల్ రెండింటి నుంచి పోటీ చేస్తుండగా.. బీజేపీ చీఫ్ రవీందర్ రైనా నౌషేరా స్థానం నుంచి బరిలో ఉన్నారు. సెంట్రల్ షాల్టెంగ్ నుంచి జమ్మూకశ్మీర్ పీసీసీ చీఫ్ తారీఖ్ హమీద్, వేర్పాటువాద నాయకుడు సర్జన్ అహ్మద్ అలియాస్ బర్కతి బీర్వా, గందర్‌బల్ సెగ్మెంట్లలో పోటీ చేయనున్నారు.