calender_icon.png 27 February, 2025 | 7:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెల్లంపల్లిలో ప్రశాంతంగా పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

27-02-2025 03:52:24 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లిలో గురువారం పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్(MLC Election Polling) ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటల నుండి పట్టభద్రులు, ఉపాధ్యాయులు స్థానిక జెడ్పి బాలుర హైస్కూల్ కు తరలివచ్చారు. పోలింగ్ కేంద్రంలో పట్టభద్రులకు, ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన వేరు వేరు బూత్ లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 5,289 మంది పట్టభద్రులు, 235 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోవలసి ఉండగా గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 20.37 శాతం పట్టభద్రులు, 52 .34 శాతం ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం నుండి పోలింగ్ శాతం పెరగడంతో 2 గంటల వరకు పట్టభద్రుల పోలింగ్ 40.57 శాతం, ఉపాధ్యాయుల పోలింగ్ 68.51 శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లి లోని పోలింగ్ కేంద్రం వద్ద ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ ఎన్. దేవయ్య బందోబస్తు నిర్వహించారు.

ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: డీసీపీ భాస్కర్

పట్టభద్రులు, ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ కోరారు. గురువారం ఎన్నికలు జరుగుతున్న బెల్లంపల్లి బాలికల హైస్కూల్ ను ఆయన సందర్శించి ఎక్కడ ఓటర్లకు ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు సిబ్బందిని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

అరకొర వసతులు.. తప్పని ఇబ్బందులు 

బెల్లంపల్లి జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎన్నికల్లో నాలుగు పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేసినప్పటికీ సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యారు. పోలింగ్ బూత్ లలో సరైన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోలేదని పట్టభద్రులు అసహనం వ్యక్తం చేశారు. ఎండ వేడిని దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్ల కోసం షామియానాలు సరిగా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్ బూత్ లను వరుసగా ఏర్పాటు చేయడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయుల క్యూ లైన్ లను గుర్తించే అవకాశం లేకుండా పోయింది.