calender_icon.png 26 February, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలింగ్ విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి

26-02-2025 05:09:23 PM

ఎమ్మెల్సీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలనలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష..

పెద్దపల్లి (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను సిబ్బంది కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష సూచించారు. బుధవారం పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీ హర్ష పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఓటర్ల సంఖ్య ఆధారంగా అవసరమైన సామాగ్రి సదరు పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అప్పజెప్పాలని, సెక్టార్ అధికారులు, పోలింగ్ సిబ్బంది ఎన్నికల నియమ, నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ తెలిపారు. 

అనంతరం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి అందజేసే కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 14 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో దాదాపు 31 వేల పట్టభద్ర ఓటర్లు, 1100 ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని అన్నారు. సజావుగా పోలింగ్ జరిగేందుకు సహాయ రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసామని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని నియమించామన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరా, వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రజలకు అవసరమైన చల్లని నీరు, క్యూలైన్ల వద్ద టెంట్, ఇతర సౌకర్యాలు కల్పించామని అన్నారు.  జిల్లాలోనీ పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయ ఓటర్లందరూ తప్పనిసరిగా ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్ లో పాల్గొనేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చి, వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు. జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదవుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలలో మనం వేసే ఓటు మన భవిష్యత్తును నిర్దేశిస్తుందని, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజలు ఆలోచించి, స్వేచ్చగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి.వేణు, రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా రవాణా అధికారి రంగారావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.