ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, జనవరి 16(విజయ క్రాంతి): ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని, తర్వాత అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్దామని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్పల్లిలో రూ.32.47 కోట్లతో చేపట్టిన నీటి సరఫరా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని దివాళా తీయించి... ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో పెట్టిందని విమర్శించారు.
అన్ని శాఖలు నష్టాలు ఉన్నాయని అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పనులు చేయలేకపోతోందన్నారు. అయితే కేంద్రం మద్దతు రాష్ట్రానికి ఎప్పుడూ ఉంటుందని, కలిసి పనిచేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని సూచించారు. విద్య, ఇతర రంగాల్లో ఎన్నో నిధులు ఉన్నాయని, కేంద్రం నుంచి డబ్బులు వచ్చినా రాష్ట్ర వాటా ఇవ్వకపోవడంతో అవి వెనక్కి వెళ్తున్నాయన్నారు. శంకర్పల్లి మాదిరిగా అన్ని చోట్ల కలిసి పనిచేద్దామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య మాట్లాడుతూ... శంకర్పల్లిలో మంచినీటి కొరతను శాశ్వతంగా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి కాలనీకి తాగునీరు అందిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో తాగునీటి సమస్య తీర్చడంతో పాటు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్స్ నిర్మిస్తున్నామన్నారు. తాము కేంద్రంలో కలిసి కేంద్రంతో కలిసి పనిచేస్తేనే మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉందని, తాము అలానే చేస్తున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సాత విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బొల్లారం వెంకట్ రెడ్డి, నాయకులు ప్రశాంత్ రెడ్డి, చంద్రయ్య, వెంకట్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాములు గౌడ్, భయానంద్, కౌన్సిలర్ అశోక్, కమిషనర్ శ్రీనివాస్, స్థానిక నేతలు పాల్గొన్నారు.