జార్ఖండ్‌లో హేమంత్ సోరేన్ మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్ రాధాకృష్ణన్ ఆయనతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడంతో మూడో సారి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించారు. అంతకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సోరేన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం, హేమంత్ సోరేన్‌ను జేఎంఎం నేతృత్వంలోని కూటమి శాసనసభ్యులు తమ నాయకుడిగా ఎన్నుకోవడం, ఆ వెంటనే ఆయన గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరడం అన్నీ చకచకా జరిగిపోయాయి. దీంతో సీఎంగా చంపై సోరేన్ పదవీ కాలం అయిదు నెలలకే పరిమితమైంది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత జనవరి 31న ఈడీ అధికారులు హేమంత్‌ను అరెస్టు చేశారు. ఈ పరిణామానికి ముందే ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
అయితే, హేమంత్ స్థానంలో ఆయన సతీమణి కల్పనా సోరేన్ సీఎం పగ్గాలు చేపడతారని అప్పట్లో వార్తలు వచ్చినప్పటికీ అనూహ్యంగా హేమంత్ సన్నిహితుడు, మరో గిరిజన నేత చంపై సోరేన్‌కు ఆ అవకాశం దక్కింది. దీంతో ఫిబ్రవరి 2న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, గత నెల 28న రాంచీ హైకోర్టుహేమంత్ సోరేన్‌కు బెయి లు మంజూరు చేయడంతో ఆయన జైలునుంచి విడుదలయ్యారు. దీంతో ఆయన మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. హైకోర్టు తీర్పుపై ఈడీ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
కానీ, బెయిల్ ఆర్డర్‌లో హేమంత్ నేరం చేశాడని భావించడానికి ఏ కారణాలు కనిపించడం లేదని జడ్జి చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలుచుకొని ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలని హేమంత్ యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తనను అన్యాయంగా అయిదు నెలలపాటు జైల్లో పెట్టారనే సందేశాన్ని ఓటర్ల్లలోకి బలంగా పంపాలని ఆయన కోరుకొంటున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. వాస్తవానికి హేమంత్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని అనుకోలేదని, అయితే ఈ అయిదు నెలల చంపై సోరేన్ పాలనలో జరిగిన తప్పుల కారణంగా పార్టీ ప్రతిష్ఠ దెబ్బ తిన్నదని జేఎంఎం వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు, హేమంత్ జైల్లో ఉన్నప్పటికీ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో జేఎంఎం మూడు సీట్లు గెలుచుకుని తమ బలాన్ని పెంచుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికలో ఆ పార్టీకి ఒక్క స్థానమే దక్కింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ హేమంత్ నేతృత్వంలో మరోసారి అధికారంలోకి వస్తామన్న విశ్వాసంతో కూటమి భాగస్వామ్య పక్షాలయిన కాంగ్రెస్, ఆర్జేడీలు ఉన్నాయి. 81 మంది ఎమ్మెల్యేలు ఉన్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రస్తుతం అధికార కూటమికి 45 మంది ఉండగా, బీజేపీకి 24 మంది ఉన్నారు.
అయితే, హేమంత్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టడం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీకి అయాచిత వరంగా మారనుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. జార్ఖండ్‌లో జేఎంఎం సర్కార్ అవినీతిలో కూరుకు పోయిందని ఆ పార్టీ చాలా రోజులనుంచే ఆరోపిస్తున్నది. దానికి తగ్గట్టుగానే లోక్‌సభ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వంలోని మంత్రి అయిన ఆలంగీర్ అలీ నివాసంలో భారీ మొత్తంలో నగదు పట్టుబడడం తో ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేశారు. మరి కొందరిపైనా అవినీతి ఆరోపణలున్నాయి. కాగా, చంపై సోరేన్‌ను అర్ధంతరంగా సీఎం పదవి నుంచి తప్పించడం కూడా కమలనాథులకు ఇప్పుడు ఓ ఆయుధం గా మారింది.
హేమంత్ కుటుంబం వాళ్లు కాకుండా మరో గిరిజన నేత ఎవరు కూడా సీఎం పదవి చేపట్టడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని, వాళ్లను తమ రాజకీయాలకు పావుగా మాత్రమే వాడుకుంటుందని బీజేపీ నేతలు ఇప్పటికే ఆరోపిస్తున్నారు. తాను ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవడంపై చంపై సోరేన్ కూడా అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి ఏ మేరకు లాభిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.