calender_icon.png 25 October, 2024 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాభివృద్ధిపై రాజకీయాలు తగవు

23-07-2024 01:25:33 AM

తెలంగాణకు నిధులు తీసుకొచ్చే బాధ్యత కేంద్రమంత్రులదే

మంత్రి పొన్నం ప్రభాకర్ వినతి

హైదరాబాద్, జూలై 22 (హైదరాబాద్): రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున నిధులను తెచ్చే బాధ్యత రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులపై ఉందని రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ మేరకు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కోరారు. తెలంగాణ విభజన హామీలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలన్నారు.

సోమవారం సచివాలయంలో మాట్లాడుతూ.. సమాఖ్య పాలనలో అవి మా నిధులు, ఇవి మీ నిధులు అంటూ మాట్లాడం తగదని,  అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన నిధులను ఎన్నికల వేళ వేరు చేసి చెప్పడం సరికాదని హితవు పలికారు. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించ వద్దని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కేబినెట్ ప్రధానితో భేటీ అయి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై విజ్ఞప్తి చేసిందన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ప్రాధాన్యం ఉండాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేకంగా హైదారాబాద్‌లో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ) నిధులు కేటాయించడం లేదని, దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మెట్రో వాటర్ వర్క్స్, 141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు చొరవ, మెట్రో, ఔటర్ రింగ్ రోడ్డు సహా హైదరాబాద్‌కు సంబంధించిన అనేక సమస్యలపై న్యాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం నుండి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని కోరారు.