- లోకల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు గ్రౌండ్‌వర్క్
- అధికార, ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు
- గ్రామాల్లో పట్టుకు యత్నాలు
- ముమ్మరంగా రాజకీయ నేతల పర్యటనలు
సంగారెడ్డి, నవంబర్ 17 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాలో రాజకీయం వేడెక్కుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న ప్రధాన పార్టీల నేతలు అందుకోసం గ్రౌండ్‌వర్క్ ప్రిపేర్ చేస్తున్నారు. గ్రామాల్లో పట్టు సాధించేందుకు ముమ్మర పర్యటనలు చేస్తూ.. కింది స్థాయి క్యాడర్‌ను అందుకు సిద్ధం చేస్తున్నారు.
సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండటంతో పార్టీలు గెలుపు కోసం పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతంలో జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు.
ఆందోల్, నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులకే జిల్లా ప్రజలు పట్టంగట్టారు. దీంతో జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్‌లు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ప్రజా ప్రతినిధులు ఉండేవారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తమ పార్టీ రాష్ట్రంలో అధికా రంలో ఉండటంలో ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు వరి, పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశాక ప్రజల వద్దకు వెళ్తున్నారు.
స్థానికల ఎన్నికల్లో ఆదరించాలని కోరుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌కు ధీటుగా బీఆర్‌ఎస్ కూడా పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బీజేపీ సైతం తమవంతు ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
గ్రామాలపై కాంగ్రెస్ ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇప్పటికే మార్కెట్ కమిటీ చైర్మన్, గ్రంథాలయం చైర్మన్‌తో పాటు సీడీసీ పదవులను భర్తీ చేసింది. వీరు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లో బలమైన నాయకుల వేటను కొనసాగిస్తున్నారు. కాగా లోకల్ ఫైట్‌లో అధికార కాంగ్రెస్‌కు ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రతిపక్ష బీఆర్‌ఎస్ దూకుడు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలు రెడీ అవుతున్నారు. గతంలో రెండు పర్యాయాలు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడం..గ్రామాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉండటం తమ సానుకూలతలని చెబుతున్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపడంతో ఇటీవల పార్టీ మారిన వారిని తిరిగి సొంతగూటికి ఆహ్వానిస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యక్రమలు నిర్వహించి స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
ఉనికిని కోసం బీజేపీ యత్నం
పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లాలో బీజేపీ సత్తా చాటింది. ఆ పార్టీ నుంచి పోటీచేసిన రఘునందన్‌రావు విజ యం సాధించారు. దీంతో స్థానిక సం స్థల ఎన్నికల్లోనూ తమ ఉనికిని చాటుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. యువ ఓటర్లను ఆకర్షించేం దుకు ముమ్మర యత్నాలు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పార్టీకి పట్టున్న నేపథ్యంలో మంచిపేరున్న వారిని బరిలో నిలిపేందుకు యత్నిస్తున్నారు. గ్రామాల్లోనూ పార్టీ విస్తరించేందుకు ఆయా కార్యక్రమాలు చేపడుతున్నారు.