సీఎం అభ్యర్థిని ప్రకటించక పోవడంపై ఆప్ సెటైర్లు
కొద్దిరోజుల్లో ఢిల్లీ ప్రజల ఆపద తొలగిపోబోతుందంటూ బీజేపీ కౌంటర్
న్యూఢిల్లీ, జనవరి 5: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సోషల్ మీడియా వేదికగా ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీల మధ్య పోరు రసవత్తరంగా మారింది. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవటంపై ఆప్ విమర్శలు గుప్పిస్తోంది. ఈ అంశంపైనే ఆదివారం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.
అందులో అందంగా అలంకరించిన గుర్రం పై వరుడు లేని వీడియో పంచుకుంది. దీని ద్వారా బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని వ్యంగ్యంగా విమర్శించింది. ‘బీజేపీ ప్రజలారా.. మీ పెళ్లి కొడుకు ఎక్కడ?” అని ప్రశ్నించింది. ఈ పెళ్లి కొడుకు లేని గుర్రం మీదేనా? కనీసం పెళ్లి కొడుకు పేరైనా చెప్పండంటూ సెటైర్లు వేసింది.
బీజేపీ కౌంటర్
ఆమ్‌ఆద్మీ పోస్ట్‌పై బీజేపీ వెంటనే స్పందించింది. ఆప్ పార్టీని ఆప్‌దా(విపత్తు) గా అభివర్ణిస్తూ.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొంది. దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపొతుందంటూ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనుండగా ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ సైతం అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.