calender_icon.png 13 November, 2024 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ చుట్టూ రాజకీయాలు

11-11-2024 01:08:10 AM

  1. నది ప్రక్షాళనపై పట్టుదలపై ఉన్న రాష్ట్రప్రభుత్వం
  2. అసెంబ్లీలో ‘ప్రజెంటేషన్’కు సన్నాహాలు
  3. కమీషన్ల కోసమే ప్రక్షాళన అంటున్న బీఆర్‌ఎస్
  4. కాంగ్రెస్, గులాబీ పార్టీ మధ్య సవాళ్లు.. ప్రతిసవాళ్లు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ప్రతిపాదన ప్రారంభించిన నాటి నుంచే, దీని చుట్టూ రసవత్తరమైన రాజకీయాలు షురూ అయ్యాయి. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పార్టీలైన బీఆర్‌ఎస్, బీజేకు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం  మామూలైంది.

మూసీ పేరుతో కమీషన్లు గుంజి ఢిల్లీ కాంగ్రె స్ పెద్దలకు పంపాలనే కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆరోపిస్తున్నది. గులాబీ నేతలు ఇప్పటికే మూసీ నిర్వాసితుల వద్దకు వెళ్లి, వారితో కలిసి నిరసన కార్యక్రమాలు సైతం చేపడుతున్నది. రెండు పార్టీల విమర్శలను ఎదుర్కొంటూనే, మరోవైపు నది ప్రక్షాళన చేయాలనే పట్టుదలతో సర్కార్ అడుగులు వేస్తున్నది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేయడంలో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు దూకుడు పెంచారు. ఇక బీజేపీ నేతలు మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదంటూనే అడపాదడపా విమర్శలు చేస్తూనే ఉన్నది.

మాటల తూటాలు..

సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలకు అవగాహన క్రతువు చేపట్టారు. ఈ నెల 8న స్వయంగా ముఖ్యమంత్రే యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెంలో పర్యటించి ‘మూసీ సంకల్ప యాత్ర’ చేపట్టారు. కొన్నికిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

స్వయంగా రెస్క్యూ పడవ ఎక్కి నదిలో ప్రయాణించారు. తర్వాత నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుపై వాక్బాణాలు వదిలారు. ‘పాదయాత్ర ట్రైలర్ మాత్రమే.. ముందున్నది అసలు సినిమా’ వ్యాఖ్యల్లో పదును పెంచారు.

అంతేకాదు.. జనవరిలో మూసీ కృష్ణాలో కలిసే వాడపల్లి నుంచి హైదరాబాద్‌లోని చార్మినార్ వరకు పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. సీఎం వ్యాఖ్యలపై మంత్రి హరీశ్‌రావు కూడా కౌంటర్ ఇచ్చారు. మూసీ సంకల్ప యాత్ర నల్లగొండ జిల్లాలో చేపట్టడం కాదని, దమ్ముంటే హైదరాబాద్‌లో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. ఈ పరిణామాలన్నీ రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. 

అసెంబ్లీ వేదికగా ‘ప్రజెంటేషన్’

మూసీ కలుషితంతో జరుగుతున్న అనర్థాలపై ఎమ్మెల్యేలు, మంత్రులకు మరింత అవగాహన కల్పించేందుకు రాష్ట్రప్రభుత్వం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే బీఆర్‌ఎస్ నిరసన కార్యక్రమాలు చేపడుతూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నదని ప్రజలకు చాటిచెప్పేందుకు సిద్ధమైందని సమాచారం. నిర్వాసితులకు న్యాయం చేస్తామని, తొవ్వ ఖర్చులకు కుటుంబానికి కొంత సొమ్ము ఇస్తామని సర్కార్ చెప్తోంది. ఒక్కరికి కూడా అన్యాయం జరగదని స్పష్టం చేస్తున్నది. వీటిపై బీఆర్‌ఎస్ ఎలా స్పందిస్తో ఇక ముందు చూడాల్సిందే.

ప్రజల నుంచి భిన్నమైన అభిప్రాయాలు..

ఒకవైపు రాజకీయ పార్టీలు సవాళ్లు.. ప్రతి సవాళ్లు విసురుకుంటుండగా, ప్రజల నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూసీని అడ్డుపెట్టుకుని పార్టీలు రాజకీయాలు చేయడం అవసరమా..? అని కొందరు నిందిస్తున్నారు. మరికొందరు మూసీ ప్రక్షాళన అయితేనే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిలో రైతులే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఎందుకంటే ఇప్పుడు తాము పండించిన ధాన్యంతో సహ కూరగాయలను ఎవరు కొనడం లేదని, మూసీ బాగుపడితే తమకు లాభం చేకూరుతుందంటున్నారు.