27-03-2025 12:24:21 AM
నల్లగొండ, మార్చి 26 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమా రం రేపుతున్నది. లీకేజీలో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందని విపక్ష బీఆర్‌ఎస్ ఆరోపిస్తుండగా.. తమపై ఆరోపణలు చేస్తే ఉరుకోబోమని కాంగ్రెస్ నేతలు దీటుగా బదులి స్తున్నారు.
ఇదే వ్యవహారంలో మంగళవారం బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌పై నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రశ్నాపత్రం లీకేజీ నిందితులతో మున్సి పల్ చైర్‌పర్సన్ రజితకు సంబంధాలున్నాయంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై చైర్‌పర్సన్ అభ్యంతర వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్‌ఎస్ నేతలు మన్నె క్రిశాంక్‌ను ఏ-1గా, కేటీఆర్‌ను -ఏ2గా, కొణతం దిలీప్‌కుమార్‌ను ఏ-3గా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్టు చేసి తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నకిరేకల్‌కు చెందిన ఉగ్గడి శ్రీనివాస్ ఫిర్యాదుతో కేటీఆర్‌పై మరో కేసు నమోదైంది. కాగా ఈ నెల 21న నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్డులోని ఎస్సెల్బీసీ పాఠశాల పరీక్ష కేంద్రంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే.