calender_icon.png 2 November, 2024 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ కు రాజకీయ పరీక్ష

25-04-2024 12:05:00 AM

ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 89 లోక్‌సభ నియోజకవర్గాల్లో రెండో దశ పోలింగ్ జరగనుంది. ఈ నెల 19న 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాల్లో జరిగిన తొలి విడత పోలింగ్‌లో  దాదాపుగా 64 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలి విడత పోలింగ్‌లో దక్షిణాదిలోని తమిళనాడు, పుదుచ్చేరిలలోని మొత్తం 40 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇక రెండో విడతలో మరో దక్షిణాది రాష్ట్రమైన కేరళలోని 20 లోక్‌సభ స్థానాలతో పాటుగా కర్నాటకలోని 14 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటుగా శశిథరూర్ తదితర  సీనియర్ నేతల భవిష్యత్తు ఈ ఎన్నికల్లో తేలనుంది. వయనాడ్ నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌తో తలపడుతున్నారు.

ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండవచ్చన్న వార్తల మధ్య  రాహుల్ గాంధీ రాజకీయ భవితవ్యంపై  రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక్కడ గెలుపు అవ కాశాలను బట్టి ఆయన యూపీలోని అమేథీనుంచి కూడా పోటీ చేయడంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు గత కొన్ని రోజు లుగా వెలువడుతూనే ఉన్నాయి. కూటమి పొత్తులో భాగంగా యూపీలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయనున్న 13 స్థానాల్లో అమేథీతో పాటుగా రాయబరేలి కూడా ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాలకు  కాంగ్రెస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. గత లోక్‌సభ ఎన్నికలదాకా దాదాపుగా  గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులే పోటీ చేస్తూ వచ్చిన ఈ రెండు నియోజకవర్గాలనుంచి  పోటీ చేయవచ్చని భావిస్తున్న వారిలో రాహుల్‌తో పాటుగా ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మే 20న  ఐదో దశ ఎన్నికల్లో భాగంగా ఈ రెండు నియోజక వర్గాల్లో  పోలింగ్ జరగనుంది. కాబట్టి అభ్యర్థుల ప్రకటన, నామినేషన్ల దాఖలకు ఇంకా సమయం ఉండడంతో  హస్తం పార్టీ సస్పెన్స్ కొనసాగిస్తోంది. అమేథీలో బీజేపీ ఇప్పటికే కేంద్రమంత్రి స్మృతి ఇరానీని తిరిగి అభ్యర్థిగా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో వయనాడ్‌తో పాటుగా అమేథీలో కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ  అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పలయిన విషయం తెలిసిందే.

ఇక కేరళతో పాటుగాబీజేపీ  పార్టీ ఎక్కువ ఆశలు పెట్ట్టుకున్న కర్నాటకలో  14 లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా శుక్రవారం పోలింగ్ జరగ నుంది. రాష్ట్ర రాజధాని బెంగళూరులో నాలుగు నియోజకవర్గాలతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తున్న మాండ్య, దేశం యావత్తు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మైసూరు సహా మరికొన్ని కీల క నియోజకవర్గాలు కూడా రెండో దశలో ఉన్నాయి.  కర్నాటకలో తాజా గా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్,  బీజేపీ మధ్య నువ్వా,నేనా అన్నట్లుగా పోటీ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ రాష్ట్రంపై కమలం పార్టీ చాలా ఆశ లు పెట్టుకుంది. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం మాత్రమే గెలుచుకోగా, మిగతా 27 చోట్ల బీజేపీ విజయం సాధించింది.

అయితే ఈ సారి ఆ పరిస్థితి లేదని పరిశీలకులు అంటున్నారు. ఇక రెండో దశ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రాజస్థాన్‌లో 13,  ఉత్తరప్రదేశ్, మహా రాష్ట్రలలో ఎనిమిదేసి, బీహార్‌లో ఏడు , పశ్చిమ బెంగాల్‌లో 3 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లలో ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.  హేమా మాలిని పోటీ చేస్తున్న మథుర, రామాయణ్ టీవీ సీరియల్ ఫేమ్ అరుణ్ గోవిల్ బరిలో ఉన్న మీరట్‌తో పాటుగా చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ పోటీ చేస్తున్న రాజ్‌నంద్ గావ్‌లో కూడా  రెండో దశలోనే పోలింగ్ జరగనుంది. బుధవారం సాయంత్రం 5గంటలకు ప్రచారం ముగియడంతో రాజకీయ పార్టీలు చివరి దశ ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.