calender_icon.png 14 November, 2024 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్నెట్‌లో రాజకీయ బురద

10-11-2024 02:05:44 AM

  1. సోషల్ మీడియాలో పెరిగిపోతోన్న దుష్ప్రచారం
  2. రాజకీయ లబ్ధి కోసం ఉపయోగిస్తోన్న పార్టీ ఐటీ సెల్స్
  3. ప్రత్యర్థులనుకించపరిచేలా పోస్టులు
  4. అధికార పార్టీ మద్దతుదారులకు ప్రభుత్వాల అండ
  5. దీంతో రెచ్చిపోతున్నమీమ్స్ క్రియేటర్స్
  6. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా ఈ పైత్యం

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రస్తుత రాజకీయాల్లో సాధారణ వార్తా మాధ్యమాలకన్నా సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటోంది. యావత్ ప్రపంచం ఉత్కంఠగా చూసే అమెరికా ఎన్నికల్లోనూ సామాజిక మాధ్యమాలే కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. డెమోక్రా ట్ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు అనుకూలంగా ఉన్నట్లు మీడియా సంస్థలు ఎన్ని సర్వేలు విడుదల చేసినా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సత్తా చాటారు.

ప్రధాన మీడియా కన్నా సామాజిక మాధ్యమాలపైనే ట్రంప్ ఎక్కువగా దృష్టి సారించి నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోనూ సోషల్ మీడియా చాలా ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల గురించి పోట్లాడుకుంటున్నారంటే డామినేషన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఏపీలో ఎప్పటినుంచో ఇదే తంతు..

ప్రత్యర్థులను బలహీనపరిచేందుకు సోషల్ మీడియాను ఇతర పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. నేతలను కించపరి చేలా పెడుతున్న పోస్టులు, మీమ్స్ పెరిగిపోతున్నాయి. వీటిపై అన్ని పార్టీలు అభ్యంత రాలు వ్యక్తం చేస్తున్నా అవే పార్టీ సోషల్ మీడియా ఖాతాల్లో పలు పోస్టులు దర్శనమిస్తుండటం కొసమెరుపు. ఏపీలో ఇలాంటి పోకడలు గత ఎన్నికల సమయంలో తారస్థాయికి చేరాయి. టీడీపీపై వైసీపీ, వైసీపీపై టీడీపీ మద్దతుదారులు ఇష్టారీతిన దుష్ప్రచారం చేశారు.

ఎన్నికలు ముగిసినా ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ నేతలపై టీడీపీ మద్దతుదారులు పెడుతోన్న పోస్టులపై జగన్ వర్గం మండిప డుతోంది. వైస్ జగన్ సహా అనేక మంది నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై ఆధారాలతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్పీలకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక కూటమి కక్షసాధింపు చర్యలకు ప్రాధాన్యమిస్తూ ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తోందని, ఇప్పటికైనా వీటిని విడనాడి పాలనపై దృష్టి పెట్టాలని వైసీపీ నేతలు సూచిస్తున్నారు. 

ప్రత్యర్థులపైనే చర్యలు..

తెలంగాణలోనూ ఈ రకమైన ధోరణి ఇటీవల పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై అసభ్యకరమైన మార్ఫింగ్ ఫొటోలు, నిరాధార ఆరోపణలు చేయడం పరిపాటిగా మారింది. కానీ, వీటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలు మాత్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం ప్రభుత్వం, అధికార పార్టీపై చేసిన పోస్టులపైనే కఠినంగా వ్యవహరిస్తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. వారిపై అరెస్టులు, దాడులు జరగడాన్ని ఖండిస్తున్నారు.

కాగా, అధికార పార్టీకి మద్దతుగా విపక్షాలు, గత ప్రభుత్వాలపై చేసే పోస్టులు, వ్యక్తులపై ప్రభుత్వం పెద్దగా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. దీనివల్ల సోషల్ మీడియాలో అసత్య ప్రచారాన్ని నియంత్రించలేమని నిపుణులు చెబుతున్నారు