calender_icon.png 13 February, 2025 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ వర్సెస్ పోలీస్!

03-05-2024 01:10:38 AM

వీడియో మార్ఫింగ్ కేసులో ట్విస్టులు

ఢిల్లీ పోలీసులు వచ్చేలోగా అరెస్టులు

హస్తిన దూకుడును అడ్డుకొనేలా ఎత్తులు 

ఉన్నట్టుండి హైదరాబాద్ పోలీసుల హడావిడి

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియోల మార్ఫింగ్ కేసులో ఢిల్లీ, హైదరాబాద్ పోలీసులు పోటాపోటీగా హడావిడి చేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లే లక్ష్యంగా సాగుతున్న ఈ కేసులో కొత్త ట్విస్ట్ మొదలయ్యింది. ఇప్పుడు పోలీస్ వర్సెస్ పోలీస్‌లాగా పరిస్థితి తయారయ్యింది. ఢిల్లీ లో నమోదుచేసిన కేసులో సీఎం రేవంత్‌రెడ్డికి నోటీసులు అందించిన ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీతకు బుధవారమే సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులిచ్చి ఆమె మొబైల్‌ను సైతం స్వాధీనం చేసు కున్నారు.

అమిత్ షా వీడియోను గీతనే ఎడి ట్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు భావిస్తున్నారు. అయితే గత నెల 29న మొదటిసారి హైదరాబాద్‌కు వచ్చిన ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్‌చార్జి మన్నె సతీష్, నవీ న్, తస్లీమాకు కూడా నోటీసులు ఇచ్చారు. గురువారం ఢిల్లీ పోలీసులు మరోసారి హైదరాబాద్‌కు వచి గాంధీభవన్‌లో కాంగ్రెస్ లీగల్ సెల్ ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి కోసం ఆరా తీశారు. ఆయన లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. గాంధీభవన్‌కు ఎందుకు వెళ్లారని ఢిల్లీ పోలీసులను బేగంబజార్ పోలీసులు ఆరా తీయగా అడ్వొకేట్ రామచంద్రా రెడ్డితో మాట్లాడటానికి వచ్చామని చెప్పి వెళ్లిపోయారు.

27నే కేసు నమోదు

నిజానికి అమిత్‌షా వీడియో మార్ఫింగ్‌కు సంబంధించి బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి ఏప్రిల్ 27న సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే దీనిని సాధారణంగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి (క్రైం నంబర్ 1014/2024) వదిలేశారు. ఐపీసీ 469, 505 (1) కింద ఈ కేసును నమోదు చేశారు. కానీ ఢిల్లీ పోలీసులు మాత్రం ఐటీ చట్టం సెక్షన్ 66 (సీ) కింద కేసు నమోదుచేసి.. ఇందులో ఐపీసీ 153, 153 ఏ, 465, 469 రెడ్‌విత్ 171 సెక్షన్లను చేర్చారు. దీనితో కేసు తీవ్రత దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఏప్రిల్ 29న హైదరాబాద్‌కు వచ్చి నోటీసులు జారీ చేశారు. అయితే గురువారం మరోసారి ఢిల్లీ పోలీసులు వచ్చిన విషయం తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు ఏప్రిల్ 27న నమోదైన కేసులో విచారణను అనూహ్యంగా వేగవంతం చేశారు. గురువారమే ముగ్గురు సోషల్ మీడియా వారియర్లు మన్నె సతీష్, నవీన్, తస్లీమాను అరెస్టుచేసి సీసీఎస్‌కు తరలించడంతో ఈ కేసు కాస్తా పోలీసు వర్సెస్ పోలీసుగా మారింది.

ఢిల్లీ పోలీసుల దూకుడుకు అడ్డకుట్ట?

మూడు రోజుల వ్యవధిలోనే రెండోసారి హైదరాబాద్‌కు ఢిల్లీ పోలీసుల రాకతో.. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యింది. ఢిల్లీలో నమోదైన కేసులో ఢిల్లీ పోలీసుల దూకుడుకు అడ్డకట్ట వేసేలా చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలనే ఆలోచనను అమలు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే హైదరాబాద్ పోలీసులకు ఉప్పందగానే.. ఏప్రిల్ 27న ఎఫ్‌ఐఆర్ చేసిన కేసులో విచారణను వేగవంతం చేశారు. ఢిల్లీ పోలీసులకు ఎలాంటి అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో వెంటనే కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లను అరెస్టు చేసినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

గురువారం సైబరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్లను పిలిపించి వెంటనే అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసుల దూకుడుకు కొంత అడ్డుకట్ట పడే అవకావం ఉన్నదని సమాచారం. శని, ఆదివారాల్లో కోర్టు ఉండదు కనుక.. సోమవారం వరకు ఢిల్లీ పోలీసులు ఆగి పీటీ వారెంట్ వేసి.. కోర్టులో తమ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించి ఆ ముగ్గురిని తీసుకెళ్లాల్సి ఉన్నది. ఈలోగా హైదరాబాద్ పోలీసులు ఇక్కడ నమోదైన కేసులో విచారణలో మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంది.