calender_icon.png 25 September, 2024 | 7:45 PM

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందుతుందన్న నమ్మకం కలిగించాలి

25-09-2024 04:37:53 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం అందుతుందన్న నమ్మకాన్ని ఎస్ఐలు, పోలీసు సిబ్బంది కలిగించేలా విధులు నిర్వర్తించాలని రామగుండం సిపి శ్రీనివాసులు సూచించారు. మంగళవారం సాయంత్రం బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని మాదారం, తాండూర్, భీమిని, కన్నేపల్లి పోలీస్ స్టేషన్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్లలో సిసిసి పిటీషన్లను, రికార్డులను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల ఫిర్యాదుల విషయంలో సత్వరం స్పందించి న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

పోలీసుల పనితీరు, వారి సమస్యలు, పలు నేరాల వివరాలు ఎస్ఐలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి గ్రామం నుండి ఇన్ఫర్మేషన్ వ్యవస్థను కొనసాగించాలని, యువతతో మంచి సంబంధాలు కొనసాగించాలని ఆయన సూచించారు. బ్లూ కోర్ట్, పెట్రో కార్ సిబ్బంది రాత్రి సమయాల్లో రౌడీషీటర్లు, కేడీలు, డి సీలు, సస్పెక్ట్ షీట్లల ఇళ్లను, పాయింట్ బుక్ లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎస్సైలు పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ కుమారస్వామి, మాదారం ,తాండూర్, భీమిని, కన్నెపల్లి ఎస్ఐలు సౌజన్య మహేష్, కిరణ్, విజయ్ కుమార్, గంగారాం లు పాల్గొన్నారు.