మనోహరాబాద్,(విజయక్రాంతి): మర్డర్ మిస్టరిని ఛేదించిన పోలీసులు గత శనివారం హత్య చేసి పరరైన నిందితున్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారని తుప్రాన్ సీఐ రంగా కృష్ణ, మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ లు వెల్లడించారు. మండలంలోని మేజర్ పంచాయతీ కాళ్లకల్ గ్రామ చివరిలో శ్రీరామ్ పాండరి అనే వ్యక్తి నూతన గృహ నిర్మాణాన్ని ప్రమోద్ పాశ్వన్ అనే గుత్తేదారునికి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే గుత్తేదారు ప్రమోద్ పాశ్వన్ వద్ద బిట్టు కుమార్, అతని భార్య పూజ పని చేస్తున్నారు.
సివిల్ వర్క్ చేస్తుండగా శనివారం ప్రమోద్ పాశ్వన్ పూజను పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు భర్త బిట్టు కుమార్ తో చెప్పింది. దీంతో కుమార్ కోపంతో అక్కడే ఉన్న కర్రతో తలపై మోదాడు. ఈ ప్రమాదంలో ప్రమోద్ పాశ్వన్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం గమనించిన బిట్టు కుమార్ ఆయన భార్య, పిల్లలను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ సుభాష్ గౌడ్, తమ పోలీస్ సిబ్బందితో కలిసి నిందితున్ని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు.