calender_icon.png 17 October, 2024 | 4:59 AM

పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి

17-10-2024 03:01:32 AM

ప్రభుత్వం ఎన్‌కౌంటర్ హత్యాకాండను ఆపాలి

తెలంగాణ మానవ హక్కుల వేదిక డిమాండ్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 16 (విజయక్రాంతి): పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించాలని, పోలీసులు జవాబుదారీగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూసుకో వాల్సిన అవసరం ఉందని తెలంగాణ మానవ హక్కుల వేదిక ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.తిరుపతయ్య, రెండు తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ సభ్యుడు వీఎస్ కృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేతుల్లోనే పోలీస్‌శాఖ పనితీరు ఉంటుందని తెలిపారు.

పోలీస్‌శాఖ న్యాయ సూత్రాలను అతిక్రమిస్తూ చేసే ఎన్‌కౌంటర్లు, హత్యలకు సర్కార్ ఒకవైపు పచ్చజెండా ఊపుతూనే, మరోవైపు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. పాలకుల ఆమోదం, ప్రోత్సాహంతో ‘ఎన్‌కౌంటర్’ హత్యకాండ సాగుతున్నదని ఆరోపించారు.

‘నక్సలైట్’ ఉద్యమాన్ని సాకుగా చూపిస్తూ ప్రభుత్వం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని, ఎన్‌కౌంటర్ల పేరిట హత్యాకాండకు పాల్పడుతోందని వాపోయారు. ఈ సంస్కృతిని నాగరిక సమాజం అంగీకరించదని పేర్కొన్నారు. మావోయిస్టులు వారి రాజకీయ వ్యూహంలో భాగంగానే హింసను ప్రయోగిస్తున్నారన్నది వాస్తవమేనని, దానిని రాజకీయంగా ఎదుర్కోవాలే గానీ, వన్య మృగాలను వేటాడినట్లు మావోయిస్టులను కాల్చి చంపకూడదని హితవు పలికారు.