రామాయంపేట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోడ్డు భద్రత వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మెదక్ చౌరస్తాలో శనివారం రోజు ఆటో యూనియన్ డ్రైవర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రామాయంపేట ఎస్ఐ బాలరాజ్ మాట్లాడుతూ... జనవరి 1 నుండి 31 వరకు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ రోడ్డు భద్రత నియంత్రణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నివారణకు ఆటో డ్రైవర్లు కృషి సహాయాన్ని అందించడానికి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రోడ్డు నియమ నిబంధనలు పాటిద్దాం ప్రజలను రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా కాపాడుకుందామన్నారు. అలాగే ఓవర్ లోడ్ వాహనాలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా నడపవద్దని, ఒకవేళ రోడ్డు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా వాహనాలు నడిపినట్లు అయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.