08-04-2025 01:39:06 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): ‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీ యూ) పరిధిలోని 400 ఎకరాల భూమి పరిరక్షణకు పోలీస్ పహారా ఏర్పాటు చేస్తాం. వర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి మాత్రం పోలీసు బలగాలను ఉప సంహరిస్తాం. అలాగే పోలీస్‌శాఖ విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఎత్తివేస్తుంది’ అని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.
వర్సిటీ ఉపాధ్యాయ సంఘంతో పలు పౌర సంఘాలతో సోమవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో క్యాబినెట్ సబ్‌కమిటీ భేటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్‌కుమార్, ఎన్‌ఏపీఎం వీ సంధ్య, డబ్ల్యూటీజేఏసీ కే సజయ, ఇమ్రాన్ సిద్దిఖీ అనేక అభ్యంతరాలను లేవనెత్తారు.
తమ తరఫున అనేక డిమాండ్లను క్యాబినెట్ సబ్‌కమిటీ ఎదుట వ్యక్తపరిచారు. అనంతరం సబ్‌కమిటీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. విద్యార్థులపై ఉన్న కేసుల ఉపసంహరణకు పోలీస్ శాఖ/ న్యాయశాఖలను సంప్రదిస్తామని, అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ వచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధ్యాపకులు, విద్యార్థులు సహా ఎవరినీ 400 ఎకరాల్లో చేపట్టే సర్వేకు అనుమతించలేమని తేల్చిచెప్పారు.
న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నందున మంత్రుల సదరు భూముల్లో అడుగుపెట్టబోదని స్పష్టం చేశారు. విద్యార్థుల సూచనలు, సలహాలు వినేందుకు మాత్రం తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. భేటీలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, సబ్‌కమిటీ సభ్యులు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీచందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రజాసంఘాల ప్రధాన డిమాండ్లు ఇవి..
* హెచ్‌సీయూ క్యాంపస్ నుంచి ప్రభుత్వం వెంటనే పోలీస్ బలగాలను ఉప సంహరించాలి. వర్సిటీ పరిధిలో ఎలాంటి నిషేధాజ్ఞ లు ఉండకూడదు.
* వర్సిటీ విద్యార్థులపై నమోదైన కేసులన్నింటినీ ఉప సంహరించుకోవాలి. పోలీస్ కస్టడీలో ఉన్న ఇద్దరు విద్యార్థులను సైతం వెంటనే విడుదల చేయాలి.
* కేంద్ర సాధికార కమిటీ క్యాంపస్‌ను సందర్శించే ముందు 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిలో నష్టం అంచనా, జీవ వైవిధ్య సర్వే నిర్వహించేందుకు నిపుణులైన అధ్యాపకులు, పరిశోధకులకు అనుమతులివ్వాలి. ఈ డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కేంద్ర సాధికార కమిటీ సమావేశానికి హాజరవుతారు.
హెచ్‌సీయూ వీసీకి డిప్యూటీ సీఎం లేఖ..
హెచ్‌సీయూలో పోలీస్ బలగాలను ఉపసంహరిస్తున్నామని, వర్సిటీ సంరక్షణకు చర్యలు చేపట్టాలని హెచ్‌సీయూ వీసీ బీజే రావుకు సోమవారం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క లేఖ రాశారు. వర్సిటీకి రాష్ట్రప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈనెల 2న వర్సిటీలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం, విద్యార్థులు, అధ్యాపకుల భద్రత కోసమే పోలీసుల బలగాలను మోహరింపజేశామని తెలిపారు.
రిజిస్ట్రార్ సైతం పోలీస్ రక్షణ కోరారని వెల్లడించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 400 ఎకరాల్లో చెట్లు, మొక్కల సంరక్షణ చర్యలు తప్ప, మరే ఇతర కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వొద్దని సూచించారు. క్యాంపస్‌లో కార్యకలాపాలను సజావుగా కొనసాగించేందుకు అవసరమైతే వర్సిటీ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. వీటన్నింటిపై వీసీ నుంచి లిఖిత పూర్వక హామీ వచ్చిన తర్వాత వర్సిటీ మెయిన్ క్యాంపస్ నుంచి పోలీసులను ఉప సంహరిస్తామని లేఖలో పేర్కొన్నారు.
ఏఐ నకిలీ వీడియోలతో ప్రచారం
హైదారబాద్, ఏప్రిల్ 7: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. కృత్రిమ మేథా సాయంతో నకిలీ వీడియోలు సృష్టించి తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది మేనక గురుస్వామి వాదనలు వినిపించారు.
మొత్తం 400 ఎకరాలకు సంబంధించిన నకిలీ వీడియోలు, ఆడియో క్లిప్లింగ్స్ తయారు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భూమిని చదును చేసే క్రమంలో బుల్డోజర్లను చూసి జింకలు, నెమళ్లు పారిపోతున్నట్టు నకిలీ వీడియోలు సృష్టించారని పిటిషన్‌లో పేర్కొంది.
ఈ నకిలీ వీడియోలను సృష్టించిన వారిపై తగు చర్యలు తీసుకునేలా ఆదేశించాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. కాగా హైకోర్టు కేసును ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ఈ నెల 16న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.