calender_icon.png 27 October, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్న పోలీసులు

13-07-2024 12:05:00 AM

  • ఓ ఫిర్యాదులో 21 నిమిషాల్లోనే రూ. 3.70 లక్షలు ఫ్రీజ్
  • మరో ఫిర్యాదులో 22 నిమిషాల్లోనే చర్యలు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12 (విజయక్రాంతి): సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నేరగాళ్ల ఆటకట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన బాధితులు గోల్డెన్ అవర్ లోపు ఫిర్యాదు చేస్తే డబ్బు నేరగాళ్లకు చిక్కకుండా చర్యలు కట్టుదిట్టం చేస్తున్నారు.  

రూ. 3.79 లక్షల ఫ్రీజ్..

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఓ ప్రైవేట్ ఉద్యోగి గురువారం సాయంత్రం 6.55 గంటలకు సీసీఎస్‌కు చేరుకొని అక్కడ విధుల్లో ఉన్న ఎన్‌సీఆర్‌పీ(నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్) అధికారి శ్రీకాంత్‌ను కలిసి తాను మోసపోయిన తీరును వివరించాడు. దీంతో అధికారి వెంటనే ఎన్‌సీఆర్ పీలో బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు, అతను డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన ఖాతా వివరాలను నమోదు చేశారు. దీనిపై స్పందించి న ఎన్‌సీఆర్‌పీ సిబ్బంది సైబర్ నేరగాళ్ల ఖాతాను బ్లాక్ చేసి, వారి ఖాతాలో ఉన్న రూ.3.79 లక్షలను హోల్డ్ చేశారు. ఫిర్యాదు అందిన కేవలం 21 నిమిషాల్లోనే రూ. 3.79 లక్షలను ఫ్రీజ్ చేశారు. 

మరో ఫిర్యాదులో సత్వర చర్యలు..

నగరానికి చెందిన వైద్యుడు గత మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీసీఎస్‌కు చేరుకొని అక్కడ విధుల్లో ఉన్న ఎన్‌సీఆర్‌పీ అధికారి ఎండీ జావీద్‌ను కలిసి తాను మోసపోయిన తీరును వివరించాడు. దీంతో అధికారి వెంటనే  ఎన్‌సీఆర్‌పీలో బాధితుడి బ్యాంకు ఖాతా వివరాలు, అతను డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసిన ఖాతా వివరాలను నమోదు చేశాడు. దీనిపై స్పందించిన ఎన్‌సీఆర్‌పీ సిబ్బంది సైబర్ నేరగాళ్ల ఖాతాను బ్లాక్ చేసి, వారి ఖాతాలో ఉన్న రూ.17.45 లక్షలను వినియోగించుకోకుండా హోల్డ్ చేశారు.

ఫిర్యాదు అందిన కేవలం 22 నిమిషాల్లోనే రూ. 17.45 లక్షలను ఫ్రీజ్ చేశారు. ఈ ఆపరేషన్‌తో సైబర్ క్రైమ్ నేరాలను కట్టడి చేస్తున్నామనడానికి ఉదాహరణ అని సీసీఎస్ అధికారులు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ జరిగినట్లు గుర్తించిన బాధితులు గంటలోపు మెయిల్ ఐడీ cybercrime.gov.in, టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న డబ్బుల అకౌంట్లను ఫ్రీజ్ చేయవచ్చని, తద్వారా డబ్బు తిరిగి పొందవచ్చని సైబర్ క్రైమ్ డీసీపీ డీ కవిత తెలిపారు.