calender_icon.png 23 October, 2024 | 12:56 PM

ఓయూలో పోలీసుల ఓవరాక్షన్

11-07-2024 12:05:31 AM

విద్యార్థులు, జర్నలిస్టుపై దాడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివర్సిటీ లో పోలీసులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులు, విద్యార్థులపై ఓవరాక్షన్ చేశా రు. బుధవారం డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ వద్ద విద్యార్థులు చేస్తున్న ఆందోళన కవరేజీకి వెళ్లిన చరణ్ అనే ఓ ఛానల్ (జీ న్యూస్) రిపోర్టర్ పట్ల అతిగా ప్రవర్తించారు. తాను మీడియా ప్రతినిధినని చెబుతున్నా పట్టింపు లేకుండా గల్లా పట్టుకొని బలవంతంగా నెట్టుకుంటూ తీసుకెళ్లి పోలీసు వాహనంలోకి నెట్టేశారు. ఓయూ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అనంతరం ఈ దాడి దృశ్యాలను డిలీట్ చేయాలని ఆ ఛానల్ కెమెరామెన్‌పై ఒత్తిడి చేశారు. ఐడీ కార్డు చూపిస్తు న్నా వినిపించుకోకుండా పోలీసులు దారుణంగా వ్యవహరించారని జర్నలిస్ట్ చరణ్ ఆరోపించారు. పోలీసుల తీరును ఖండించారు. ఈ ఘటనను పలు సంఘాల నాయకులు ఖండించారు. మాజీ మంత్రి కేటీఆర్ జర్నలిస్టును ఫోన్‌లో పరిమర్శించారు.

విద్యార్థులను దుర్భాషలాడుతూ.. 

డీఎస్సీని వాయిదా వేయాలని ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఎదుట  నిరసన తెలిపేందుకు విద్యార్థులు యత్నించారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 25 వేల పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలని నినదించారు. ఆ విద్యార్థులతో పోలీసులు దుర్భాషలాడారు. మూకుమ్మడి దాడి చేయడంతో పాటు వారిని అరెస్టు చేశారు. కవరేజీ చేస్తున్న జర్నలిస్టులపై ఫైర్ అయ్యారు.