పోలీస్ అధికారుల సమీక్షా సమావేశంలో డీపీసీ, అడిషనల్ డీసీపీలు
ఖమ్మం,(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు పక్కా పకడ్బందీ వ్యూహంతో ముందుకు పోతున్నామని ఖమ్మం డీసీపీ నరేశ్ కుమార్(Khammam DCP Naresh Kumar), అడిషనల్ డీసీపీ ప్రసాదరావు(Additional DCP Prasada Rao) పేర్కొన్నారు. జిల్లాలోని పోలీసు అధికారులతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. విద్యా సంస్ధల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ(Anti-Drugs Committee)ల ద్వారా విద్యార్ధులకు అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో ర్యాలీలు, సదస్సులు నిర్వహించి, మాదక ద్రవ్యాల నిర్మూళనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
అదే క్రమంలో సైబర్ నేరాలపై కూడా ప్రజల్లో అవేర్‌నెస్ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సైబర్ నేరగాళ్ల భారిన పడ్డామని గుర్తించిన వెంటనే 1930 లేదా సైబర్ వెబ్‌సైట్‌కు నేరుగా ఫిర్యాదు చేస్తే పోయిన డబ్బు వెనక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఓటీపీకి సంబంధించిన వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత పట్టిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటా బేస్ (ఐరాడ్) ద్వారా కారణాలు తెలుసుకుని నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ,సిబ్బందికి సూచించారు.
జాతీయ, రాష్ట్ర,గ్రామీణ రహదారుల్లో జరుగుతున్న ప్రమాదాలపై విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టేందుకు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ పర్యవేక్షణలో అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే జిల్లాలో గుర్తించిన 68 బ్లాక్ స్పాట్స్‌లో బ్యారికేడింగ్,స్టాపర్స్, సిగ్నల్ లైట్స్, బ్లింకింగ్ లైట్స్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన చోట వేగ నియంత్రణలు నిర్మించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వాహన చట్టంలోని నిబంధనలు అమలు చేయడం ద్వారా ప్రమాదాలను నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేశామని డీసీపీలు తెలిపారు.