calender_icon.png 16 April, 2025 | 7:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిందితుడికి బదులు జడ్జి కోసం వెతుకులాట

14-04-2025 11:46:22 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసు అధికారి నిర్లక్ష్యం

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యంతో విచిత్ర పరిస్థితి ఎదురైంది. కేసు విషయమై నిందితుడిని వెతకాల్సిన చోట జడ్జిని వెతకడం ఆశ్చర్యం కలిగించింది. విషయంలోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బన్వారిలాల్ ఒక దొంగతనం కేసులో నిందితుడు పేరు రాయాల్సిన ఉత్తర్వులో జడ్జి పేరు రాశారు. సంబంధిత కేసులో నిందితుడు హాజరుకావాలని ఆదేశిస్తూ కోర్టు ఇచ్చిన నోటీసుల్లో నగ్మాఖాన్ అని జడ్జి పేరు రాసుకున్నారు. నోటీసులు అందిచాల్సిన ఇంటికి వెళ్లి ఈ పేరు చెప్పి ఆరాతీయగా.. అలాంటివారు ఎవరూ లేరని అర్థమైంది. ఎంత వెతికినా ఆ ఇంట్లో నగ్మాఖాన్ కనిపించలేదని జడ్జి నగ్మాఖాన్‌కే ఎస్సై నివేదించారు.

ఆ తర్వాత నోటీసులు చదివిన జడ్జి తన పేరు ఉండడం చూసి అవాక్కయ్యారు. ‘ఈ కోర్టు ఎవరికి, ఏ తరహా నోటీసులు పంపిందో పోలీసు అధికారికి తెలియకపోవడం వింతగా ఉంది. ఇంత నిర్లక్ష్యమా? అసలు నోటీసులు ఆ అధికారి చదవలేదని, వాటి గురించి కనీస పరిజ్ఞానం కూడా లేదనిపిస్తోంది. కోర్టు నోటీసులు అందించే వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే ఆ ప్రక్రియలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు’ అని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బన్వరిలాల్‌పై చర్యలు తీసుకోవాలని యూపీ పోలీస్ చీఫ్‌కు ఆదేశాలు ఇచ్చారు.