28-04-2025 02:28:05 AM
బీఆర్‌ఎస్ నేతలు ఎర్రబెల్లి, పల్లా ఆరోపణలు
మహబూబాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు వచ్చే వాహనాలను పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని, పలుచోట్ల ఎల్కతుర్తికి వచ్చే వాహనాలకు ఎదురుగా లారీలను పంపుతూ ట్రాఫిక్ జామ్ చేసి లక్షలమంది కార్యకర్తలను రాకుండా అడ్డుపడుతున్నారని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.
ఎల్కతుర్తిలో నిర్వహించిన రజతోత్సవ సభ వేడుకలో పలుమార్లు వారిరువురూ మైకు ద్వారా ‘పోలీసులారా.. సభకు వచ్చే వాహనాలకు అడ్డంకులు కల్పించకండి..’ అంటూ పేర్కొనడం జరిగింది. ఖమ్మం వైపు నుంచి 20 కిలోమీటర్ల వరకు, సిద్దిపేట, హుజూరాబాద్ నుంచి పది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్‌జామ్ జరిగి 2 లక్షల మంది వరకు కార్యకర్తలు సభకు రాలేకపోతున్నారని తెలిపారు.
చివరకు ఇదే విషయంపై పార్టీ అధినేత కేసీఆర్ కూడా వ్యాఖ్యానిస్తూ, సభకు లక్షల మందిని రాకుండా అడ్డుపడ్డారని, కొద్దిసేపు నిరీక్షించిన తర్వాత సభ జరుపుదామని చెప్పగా, చాలా దూరం నుంచి లక్షల మంది వచ్చారని వారు మళ్లీ తిరిగి వెళ్లడం ఇబ్బందిపడాల్సి వస్తుండటంతో సభ ప్రారంభించాల్సిందిగా కోరారని కేసీఆర్ పేర్కొన్నారు.