డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి
కరీంనగర్, నవంబర్ 21 (విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగం అంటేనే త్యాగానికి ప్రతీక అని, ఉద్యోగంలో నిత్యం అనేక సవాళ్లు ఎదురవుతాయని, వాటిని ఎదుర్కొని పరిష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ వీబీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌లోని సిటీ ట్రైనింగ్ సెంటర్‌లో రాచకొండ కమిషనరేట్‌కు చెందిన 248 మంది ఏఆర్ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయింది. గురువారం నిర్వహించిన కార్యక్రమానికి కమలాసన్‌రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయనకు సీపీ అభిషేక్ మహంతి, సీటీసీ ప్రిన్సిపాల్ అడిషనల్ డీసీపీ ఏ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ ఏసీపీ వేణుగోపాల్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ.. శిలలుగా శిక్షణలో చేరిన 248 మంది ట్రైనీ కానిస్టేబుల్స్‌ను శిల్పాలుగా తీర్చిదిద్దిన సీటీసీ అధికారులను అభినందించారు.
9 నెలల బేసిక్ ఇండక్షన్ ట్రైనింగ్ ఎంతో కష్టపడి విజయవంతంగా పూర్తి చేసినందుకు అభినందిస్తున్నానని, శిక్షణలో చాలా వరకు ఉన్నత చదువులు అభ్యసించినవారే ఉండ టం సంతోషం కలిగించిందని చెప్పారు. నిత్యం నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. నిష్పక్షపాతంతో నిజాయితీతో పనిచేసి పోలీస్‌శాఖ గౌరవాన్ని పెంచాలని కోరారు. సీటీసీలో 2019 మియావాకి పద్ధతిలో ఏర్పాటు చేసిన చిట్టడవిని సంరక్షిస్తున్నందుకు కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని అభినందించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబరిచిన ట్రైనీ కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు ప్రదానం చేశారు.