- తెలంగాణ పోలీస్ అకాడమీలో ‘దీక్షాంత్ పరేడ్’ పాసింగ్ అవుట్
- ముఖ్య అతిథిగా విచ్చేసిన డీజీపీ జితేందర్
- శిక్షణ పూర్తిచేసుకున్న 1,211 మంది మహిళా కానిస్టేబుళ్లు
హైదరాబాద్ సిటీబ్యూరో/మేడ్చల్/ చార్మినార్, నవంబర్ 21 (విజయక్రాంతి): పోలీస్ ఉద్యోగమనేది ఓ వృత్తిలా కాకుండా ప్యాషన్‌తో నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. గురువారం రాజాబహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన కానిస్టేబుళ్ల ‘దీక్షాంత్ పరేడ్’ పాసింగ్ అవుట్‌ను ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర డీజీపీ జితేందర్ హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారితో అకాడమీ చీఫ్ అభిలాష బిస్త్ ప్రమాణం చేయించారు. పరేడ్‌కు జనగామ జిల్లా పాలకుర్తి మండలం తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య కమాండర్‌గా వ్యవహించారు. డీజీపీ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరుతున్న కానిస్టేబుళ్లు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు.
ప్రజలకు సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగంలోకి వచ్చామని, నిరంతరం శాంతిభద్రతల విషయం లో బాధ్యతగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాలు బీఎన్‌ఎస్, బీఎన్‌ఎస్‌ఎస్, బీఎస్‌ఏపై పూర్తి అవగాహనను పెంపొందించు కోవాలని డీజీపీ.. అభ్యర్థులకు సూచించారు. అకాడమీ చీఫ్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు వృత్తిలో చేరిన తర్వాత కూడా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
మొట్టమొదటిసారిగా శిక్షణ కేంద్రంలో ఫీడింగ్(పాలిచ్చే తల్లులు) కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులు, శిక్షణ ఇచ్చిన అధికారులకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. మేడ్చల్‌లోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో శిక్షణ పూర్తి చేసుకున్న 526 మంది కానిస్టేబుళ్లకు అవుట్ పాసింగ్ పరేడ్ నిర్వహించారు.
ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్‌రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కానిస్టేబుళ్లను ఉద్దేశించి మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. ప్లేట్‌బుర్జు హెడ్‌క్వార్టర్స్ పరేడ్ మైదానంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హాజరై పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.