calender_icon.png 18 January, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అఫ్జల్‌గంజ్‌లో కాల్పులు... నిందితుల కోసం వేట

17-01-2025 03:48:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అఫ్జల్‌గంజ్‌లో గురువారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనపై హైదరాబాద్ పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన గంట తర్వాత, దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ట్రావెల్ ఏజెన్సీలను, నిఘా కెమెరాలను పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుండి ఎవరైనా తెలంగాణకు వచ్చారనే కోణంలో పోలీసులు అఫ్జల్‌గంజ్‌లోని లాడ్జీలు, ఇతర హోటళ్లను తనిఖీ చేశారు. కర్ణాటకలోని బీదర్‌లోని ఏటీఎంలో జరిగిన దోపిడీ వెనుక ఉన్న ఇద్దరు దొంగలను పట్టుకోవడానికి తాము ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఉన్నతాధికారి తెలిపారు. బీదర్‌లోని ఏటీఎం కియోస్క్‌లో ఇద్దరు సెక్యూరిటీ గార్డులను కాల్చి, రూ.93 లక్షలు దోచుకున్నారు. బీదర్‌లో జరిగిన దాడి తర్వాత వీరిద్దరూ బైక్‌పై రాష్ట్రంలోకి గురువారం తెల్లవారుజామున ప్రవేశించారని పోలీసులు తెలిపారు.

తెలంగాణ నుంచి రాయ్‌పూర్‌కు వెళ్లాలని భావించి నిన్న మధ్యాహ్నం 3 గంటలకు అఫ్జల్‌గంజ్‌లోని ట్రావెల్ ఆఫీసుకు వెళ్లి మేనేజర్‌ను టిక్కెట్లు అడిగారు. మేనేజర్ మహమ్మద్ జహంగీర్ వారి ప్రవర్తనపై అనుమానం వచ్చి, శివార్లలో వేచి ఉన్న ట్రావెల్ కంపెనీ బస్సు వద్దకు తీసుకెళ్లడానికి మినీ బస్సు కోసం వేచి ఉండమని చెప్పాడు. జహంగీర్ వారి ఐడి కార్డులను అడగడంతో ట్రావెల్స్ కంపెనీ మేనేజర్‌ జహంగీర్ తో వాగ్వాదానికి దిగి ముఠా సభ్యుల్లో ఒకరు అతని కాలు, కడుపుపై కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైపు పారిపోయారని, దాడి చేసిన వారి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, అతను హిందీ మాట్లాడుతున్నాడని వెల్లడించారు. దుండగులు బ్యాక్‌ప్యాక్‌లను తీసుకెళ్లారని పోలీసులకు ట్రావెల్ కంపెనీ వారు తెలిపారు. దీంతో హైదరాబాద్ పోలీసులు రెడ్ అలర్ట్ ప్రకటించి దాడి చేసిన వ్యక్తిని గుర్తించడానికి వివిధ ప్రాంతాలలో గాలింపు చర్యలు ప్రారంభించారు.