01-04-2025 02:44:14 AM
మద్యం మత్తులో రాత్రంతా భక్తురాలిపై 9 మంది లైంగిక దాడి!
దాహం వేస్తుందన్న మహిళ నోట్లో మూత్ర విసర్జన
మహిళ బంధువు చేతులు, కాళ్లు కట్టేసి అతడి ముందే అత్యాచారం
ఊరుకొండపేట అంజన్న ఆలయం వద్ద ఘటన
ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
నిందితుల్లో ఆలయ ఉద్యోగి, గ్రామ యువకులు
నాగర్‌కర్నూల్, మార్చి 31 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ పేటలోని అంజన్న ఆలయానికి దర్శనం కోసం భక్తురాలిపై తొమ్మిది మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలయంలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో పాటు గ్రామానికి చెందిన యువకులు ఈ దారుణానికి ఒడిగట్టారు. తొమ్మిది మంది రాత్రంతా మద్యం మత్తులో ఆ మహిళపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ మహిళ దాహం వేస్తుందని ప్రాధేయపడినా వినకుండా నోట్లో ఉమ్మివేస్తూ, మూత్ర విసర్జన చేస్తూ కౄరత్వాన్ని ప్రదర్శించారు.
ఆమె వెంట వచ్చిన బంధువు అంగీ, పాయింట్ విప్పి, వాటితో చేతులు, కాళ్లు కట్టేసి అతని ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. తన దూరపు చుట్టపు వ్యక్తితో చనువుగా ఉంటున్న మహిళ.. ఈ నెల 29న దైవదర్శనం కోసం ఊరుకొండపేట అంజన్న ఆలయానికి వెళ్లింది. దర్శనం అనంతరం తన బంధువుతో కలిసి బహిర్భూమికి వెళ్లింది.
దాన్ని గ్రహించిన ఆలయ ఉద్యోగి మహేశ్.. గ్రామంలోని కొందరి యువకులకు ఫోన్ చేసి రప్పించాడు. గ్రామానికి చెందిన బంగారు ఆంజనేయులు, మట్ట ఆంజనేయులు, బాబా, కౌకుంట్ల అరిశ్, వాగుల్ధార్ మణికంఠ ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతంలోకి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న దుండగులు.. మహిళ వెంట వచ్చిన వ్యక్తిని బెదిరించి అతడి అంగీ, పాయింట్ విప్పి వాటితోనే అతడి చేతులు, కాళ్లు కట్టేశారు. అతడి ముందే ఆ మహిళపై వరుసగా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి ఒడిగట్టారు.
తాగిన మత్తు వదిలిన తర్వాత మరికొంత మద్యం తేవాలని మరో వ్యక్తికి ఫోన్ చేసి ఫోన్ పే ద్వారా డబ్బు పంపారు. మద్యం సీసాలతో వచ్చిన ఆ వ్యక్తి సైతం మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇలా రాత్రంతా ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడటంతో అలసిపోయిన మహిళ.. దాహం వేస్తోందని, నీళ్లివ్వాలని కోరింది. అయినా కనికరించకుండా ఆమె నోట్లో ఉమ్మివేస్తూ, మూత్ర విసర్జన చేస్తూ పైశాచికంగా వ్యవహరించారు.
చివరికి మహిళ మెడలో ఉన్న బంగారం నగలతోపాటు ఆమె వద్ద ఉన్న నగదును దోచుకెళ్లారు. బాధితురాలు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీఫుటేజ్ ఆధారంగా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు పరారిలో ఉన్నట్లు సమాచారం. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఏఎస్పీ రామేశ్వర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి కొన్ని ఆధారాలను సేకరించినట్లు పేర్కొన్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించామన్నారు.
వెలుగులోకిరాని ఘటనలు మరెన్నో!
ప్రతి శని, ఆదివారాలు భారీ సంఖ్యలో భక్తులు అంజన్న ఆలయానికి వచ్చి రాత్రి అక్కడే నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒంటరిగా బయటికి వెళ్లే జంటలను టార్గెట్ చేస్తూ మండలంలోని కొన్ని గ్రూపులుగా ఏర్పడిన ఆగంతకులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. ఇలాంటి ఘటనలు నిత్య కృత్యంగా జరుగుతూనే ఉంటాయని కానీ వెలుగులోకి రాణి పరిస్థితి నెలకొందని గ్రామస్థులు పేర్కొన్నారు. మద్యానికి బానిసలుగా మారిన కొంతమంది యువకులు ఒంటరిగా తిరిగే జంటలపై దాడి చేసి బం గారం నగలు, నగదు దోచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతుంటారని ఆరోపిస్తున్నారు.