calender_icon.png 1 January, 2025 | 9:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి స్మగ్లర్లతో పోలీసుల దోస్తీ!

03-11-2024 01:02:53 AM

  1. డబ్బులు తీసుకొని పట్టుకున్న సరుకు వదిలేసిన పలువురు ఖాకీలు
  2. పలుమార్లు తామే సరుకును అమ్ముకున్న వైనం
  3. నలుగురిపై సస్పెన్షన్ వేటు

సంగారెడ్డి, నవంబర్ 2 (విజయక్రాంతి): శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు అక్రమాలకు పాల్పడటం తాజాగా వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన గంజాయి స్మగ్లర్ల నుంచి డబ్బులు తీసుకొని సరుకును వదిలేయడమే కాకుండా పలుమార్లు స్వాధీనం చేసుకున్న గంజాయిని వారే అమ్ముకున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగులోకి రావడంతో ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీసు సబ్ డివిజన్‌లోని మానూర్ స్టేషన్ ఎస్సై అంబరియా, హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ (డ్రైవర్) మధు 2024 మే 31న గంజాయి రవాణా చేస్తున్న వారిని అడ్డుకొని 120 కిలోల గంజాయిని తమ వాహనంలోకి ఎక్కించి స్మగ్లర్లను వదివేశారని అధికారులు విచారణలో వెల్లడైన ట్లు తెలిసింది.

అదేవిధంగా గతంలోనూ 7 నెలల క్రితం ఎస్సైలు అంబరియా, వినయ్‌కుమార్ ( అప్పటి సంగారెడ్డి రూరల్ ఎస్సై), హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, కానిస్టేబుల్ మధు నిజామాబాద్ జిల్లాలోని వర్నిలో గంజాయి స్మగ్లర్లను అడ్డుకొని వారి నుంచి 400 ప్యాకెట్లు తీసుకొని వదిలేసినట్లు అధికారుల విచారణలో వెలుగులోకి వచ్చింది. దీంతో వీరిని సస్పెండ్ చేస్తూ మల్టీజోన్ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

స్మగ్లర్లతో సంబంధాలు?

అంతర్‌రాష్ట్ర గంజాయి స్మగ్లర్లతో హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్‌కు సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దీంతో మానూర్ ఎస్సైకి డబ్బుల ఆశ చూపి అనేక అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్‌కు కర్ణాటక, మహారాష్ట్రలో బంధువులు ఉండడంతో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయిని అక్కడే తిరిగి అమ్మినట్లు తెలిసింది.

సదరు హెడ్ కానిస్టేబుల్ జహీరాబాద్ రూరల్, నారాయణఖేడ్ సర్కిల్‌లో పనిచేసిన సమయం లోనూ అనేక అక్రమాలకు పాల్పడినా అధికారులు చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని ఎస్‌బీ, సీసీఎస్, స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో పనిచేశారనే విమర్శలు ఉన్నాయి.

గంజాయి స్మగ్లర్లతో సం బంధాలు పెట్టుకొని ఒక్కసారి పట్టుకొని, పదిసార్లు వదిలేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నేళ్లుగా పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహించకుండా ప్రత్యేక టీంలో పనిచేసి లక్షలు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఇద్దరు గంజాయి స్మగ్లర్లను పోలీసు అధికారులు విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.  

వారి పరిధి కాకపోయినా..

గంజాయి స్మగ్లర్లు నిజామాబాద్ జిల్లాలోని వర్ని సమీపంలో ఉన్నారని, వారిని పట్టుకుంటే లక్షలు వస్తాయని హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి వాహనాన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఆ వాహనాన్ని కొన్ని రోజులు సంగారెడ్డిలో ఉంచినట్లు తెలిసింది. వాహనంలోని గంజాయి ప్యాకెట్లను హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ద్వారా అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి పరిధి కాకపోయినా వేరే జిల్లాకు వెళ్లి గంజాయి పట్టుకొని అక్రమాలకు పాల్పడ్డారు. 

అప్రూవర్స్‌గా మారి..

ఈ మొత్తం వ్యవహారంపై మల్టీజోన్ ఐజీ విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో ఎస్పీ విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. అరెస్ట్ చేస్తామని చెప్పడంతో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ అప్రూవర్‌గా మారి గంజాయి స్మగ్లర్లతో ఉన్న సంబంధాలు చెప్పినట్లు తెలిసింది.

దీంతో ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసు అధి కారులు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. గంజాయి స్మగ్లర్ల సెల్‌ఫోన్‌లో కానిస్టేబుల్ నంబర్ ఉండడంతో, వారికి కానిస్టేబుల్ ఇన్‌ఫార్మర్ గా పనిచేసినట్లు పోలీసు అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం.