హైదరాబాద్: బురఖా ధరించిన ముస్లిం మహిళా ఓటర్లు తమ గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి పోలింగ్ స్టేషన్‌లో తమ ముఖాలను చూపించాలని కోరినందుకు హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుండి బిజెపి అభ్యర్థి కె. మాధవి లతపై హైదరాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఆమెపై మలక్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 171, 186, 505 (1) సి కింద కేసులు నమోదు చేశారు. బిజెపి అభ్యర్థి ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేసి, వారి ముఖాలు చూపించమని కోరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో హైదరాబాద్ జిల్లా కలెక్టర్, లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి అయిన జిల్లా మేజిస్ట్రేట్ అనుదీప్ దురిశెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఆమెపై కేసు నమోదైంది.