calender_icon.png 17 March, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్తీ కల్లు దుకాణాలపై పోలీసుల ఉక్కు పాదం

05-03-2025 06:20:57 PM

కల్తీ కల్లు చిన్నపిల్లలకు అమ్ముతున్నారని ఫిర్యాదులు..

కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలో ఐదు కల్లు దుకాణాలలో విక్రయాలు బంద్..

నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు..

కామారెడ్డి అడిషనల్ సూపరిండెంట్, చైతన్య రెడ్డి..

కామారెడ్డి (విజయక్రాంతి): కల్తీ కల్లు విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కల్తీ కల్లు విక్రయాలు అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తు ఉండడంతో పోలీసుల వద్దకు వచ్చిన ఫిర్యాదులతో కల్తీ కల్లు విక్రయాలు చేపడుతున్న దుకాణాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానికులు పోలీసులకు కల్తీకల్లు అమ్మకాలు చేపడుతున్న దుకాణాల వివరాలను తెలుపడంతో పోలీసులు ఐదు కల్తీ కల్లు దుకాణాలకు తాళాలు వేసి విక్రయాలు బంద్ చేయించారు. గత నెల 25న కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కల్లు మూస్తే దారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన కామారెడ్డి అడిషనల్ పోలీస్ సూపర్డెంట్ చైతన్య రెడ్డి స్ట్రీట్ వార్నింగ్ ఇచ్చారు. కల్లు విక్రయిస్తున్న దుకాణాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కల్లులో మత్తుపదార్థాలు కల్పవద్దని హెచ్చరించారు.

18 సంవత్సరాల లోపు బాల బాలికలకు కల్లు విక్రయించరాదని చెప్పిన వారం రోజులు గడవక ముందే దేవునిపల్లిలోని ఐదు కల్లు దుకాణాలలో చిన్నపిల్లలకు కల్లు విక్రయించడంతో దుకాణాలను తాళాలు వేసి నిబంధనలకు విరుద్ధంగా కల్తీ కల్లు విక్రయాలు చేపట్టిన దుకాణాల యజమానులపై కేసులు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి బుధవారం విజయక్రాంతి ప్రతినిధితో తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో కల్తీకల్లును దుకాణాలలో విక్రయిస్తున్న 5 దుకాణాలను మూసివేసి ఎక్సైజ్ శాఖ జారీ చేసిన లైసెన్స్ యజమానులపై ఎన్డిపిఎస్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేయడం జరిగిందని కామారెడ్డి ఏఎస్పి చైతన్య రెడ్డి తెలిపారు. కల్లు విక్రయదారులు చట్టంలోని నిబంధనలను తూచా తప్పకుండా పాటించి వ్యాపారాలు నిర్వహించుకోవాలని చట్టం పరిధి దాటి వ్యాపారం చేస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని ఎవరి ఒత్తిడిలకు తల ఒగ్గేదిలేదని ఆమె స్పష్టం చేశారు.

18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్లు విక్రయాలు చేయవద్దని చేస్తే చట్ట పరిధిలో కేసులు నమోదు చేసి శిక్షిస్తామని కల్లు ముస్తదారులతో ఇటీవలనే కామారెడ్డి ఎస్పి కార్యాలయంలో సమావేశం నిర్వహించి ప్రభుత్వ నిబంధన మేరకు కల్లు విక్రయాలు జరుపుకోవాలని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కల్లు దుకాణాల ముందు 18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్లు అమ్మబడదు. ఇదే క్రమంలో కల్లు దుకాణాల్లో మద్యం సేవించడం నేరం అని తెలియజేస్తూ బ్యానర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించినప్పటికీ రెండు కల్లు దుకాణాల ముందు మాత్రమే బ్యానర్ ఏర్పాటు చేసుకున్నారని మిగతా ముగ్గురు చేసుకోలేదని ఆమె స్పష్టం చేశారు. కల్లు విక్రయదారులు స్వచ్ఛమైన కల్లును ప్రజలకు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి ప్రభుత్వం కేటాయించిన సమయాలలో కల్లు విక్రయించుకోవచ్చన్నారు. చిన్నపిల్లలు కల్తీ కల్లుకు అలవాటు పడితే వారి భవిష్యత్తు దానికి బానిసై వారి కుటుంబాలు జీవితాలు అనారోగ్యాల పాలై వారి ఆర్థిక స్థితిగతులు దిగజారిపోయే ప్రమాదం ఉందన్నరు.

బడికి వెళ్లాల్సిన వయసులో ఉన్న పిల్లలు ఒకసారి కల్తీకల్లుకు అలవాటు పడితే దానిని మరిచిపోవడం కష్టసాధ్యమని అందువల్లనే 18 సంవత్సరాల లోపు పిల్లలకు కల్లు విక్రయించ వద్దని హెచ్చరించడం జరిగిందన్నారు. కల్తీ కల్లు తాగడం అలవాటు పడితే నాడీ వ్యవస్థ కండరాల వ్యవస్థ మతిస్థిమితం వచ్చే ప్రమాదం ఉందని కల్తీకల్లు సేవించని ఎడల మతిస్థిమితం తప్పి పిచ్చిపిచ్చిగా తయారయ్యే ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నందున కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో ఎవరు చనిపోకూడదన్న ఉద్దేశంతో సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలలో రోడ్డు నాణ్యత ప్రమాణాలను పరిశీలించాలని సూచించడంతో ఇంజనీర్లు రోడ్డు శాస్త్రీయంగా సాంకేతికంగా లోపాలు ఉంటే సరిచేయాలని తెలియజేయడంతో ఇంజనీర్లు రోడ్డు సరిగ్గా లేక ప్రమాదాలు జరిగే ప్రాంతంలో రోడ్లను వాహనాలకు అనుగుణంగా మార్చడంతో సాధ్యమైనంత వరకు రోడ్డు ప్రమాదాలను నివారించడం జరిగిందని ఏఎస్పీ తెలియజేశారు. గంజాయి, అల్ఫాజోమ్ డైజోఫామ్ విక్రయాలు జరిపితే కఠినంగా శిక్షించడం జరుగుతుందన్నారు.