calender_icon.png 24 February, 2025 | 1:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ దందాలపై పోలీసుల ఉక్కుపాదం

19-02-2025 08:38:11 PM

పిడిఎస్ బియ్యం, గుడుంబా, ఇసుక ట్రాక్టర్ల పట్టివేత...

కాటారం (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ దందాలపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. కాటారం మండలం పరిధిలో బుధవారం పోలీసులు పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం, అలాగే అనుమతి లేని ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను, నిషేధిత గుడుంబా రవాణా చేస్తున్న వారిని డేగ కన్నేసి పట్టుకున్నారు. అక్రమ  కార్యకలాపాలపై పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టాలని స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేదించిన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం మెరుపు దాడులకు సిద్ధమవుతున్నారు.

కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ నాగార్జున రావు నేతృత్వంలో ఎస్సై అభినవ్ ప్రత్యేక బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. బుధవారం ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు మండల కేంద్రానికి సమీపంలోని బొప్పారం క్రాస్ వద్ద పోలీస్, రెవిన్యూ సిబ్బంది సంయుక్తంగా ఎస్సై అభినవ్ ఆధ్వర్యంలో మాట వేశారు. టాటా ఏసీ ట్రాలీలో తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ మంతెన రమేష్, బియ్యం కొనుగోలు చేసిన తాళ్లపల్లి సమ్మయ్య లను పట్టుకొని, వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. 

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న తాళ్ల శేఖర్, డ్రైవర్ సారయ్య లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  అలాగే నిషేధ గుడుంబా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు కాటారంలో తనిఖీలు నిర్వహించగా సిలువేల లక్ష్మి అనే మహిళ ఇంట్లో 5 లీటర్ల గుడుంబా లభించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభినవ్ తెలిపారు. పేద ప్రజలకు చెందాల్సిన పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేసినా,  నిషేధిత గుడుంబా విక్రయాలు చేపట్టినా,  రవాణా సాగించినా, అనుమతి లేని ఇసుక అక్రమ రవాణా  దందాలపై పోలీసు యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని కాటారం ఎస్సై అభినవ్ పేర్కొన్నారు.