- హైకోర్టు జడ్జీలు, ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్ జరిగినట్టు వెల్లడి
- కేసు విచారణలో మరికొంతమంది అరెస్టుకు అవకాశం ఉందని తెలిపిన పోలీసులు
- కేటీఆర్ ఆదేశాలతోనే ట్యాపింగ్ అని ఆరోపణ
హైదరాబాద్, జూలై 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో మలుపు తిరగబోతోంది. హైకోర్టు న్యాయమూర్తి, ఆయన భార్య, నేటి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు, పలువురు కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి తదితరుల ఫోన్లను బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాప్ చేసినట్టు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ నవీన్‌రావు ఇతర బీఆర్‌ఎస్ అగ్రనేతల ఆదేశాల మేరకే ఫోన్ల ట్యాపింగ్ జరిగిందని తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులు కొండల్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, వినయ్‌రెడ్డ్డి, కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్త్కమ్‌కుమార్‌రెడ్డ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ఈటల నితిన్, ధర్మపురి అర్వింద్, శివధర్‌రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్, రాఘవేందర్‌రెడ్డి, ఎం రమేశ్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు రొనాల్డ్‌రోస్, దివ్య, శశాంక్ తాతినేని, రాజ్‌న్యూస్ అధినేత సునీల్‌రెడ్డి, చిలుక రాజేందర్‌రెడ్డి, కే వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ అధినేత నరేంద్రనాథ్ చౌదరి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఏఎంఆర్ ఇన్‌ఫ్రాకు చెందిన మహేశ్వర్‌రెడ్డి, వీరమల్ల సత్యం, మెఘా శ్రీనివాస్‌రెడ్డి, మైనంపల్లి రోహిత్, పీడీ కృష్ణకిషోర్ తదితరుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు నివేదికలో ప్రభుత్వం వివరించింది.
ఫోన్ ట్యాప్‌లు రాష్ట్రాల పరిధిలోనే..
ఎస్‌ఐబీ అదనపు ఎస్పీ (సస్పెండెడ్) భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రాజకీయ ప్రత్యర్థులు, ప్రైవేటు వ్యక్తులతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటో పిటిషన్‌గా పరిగణించి విచారణ చేపట్టింది. బుధవారం చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్‌కుమార్‌తో కూడిన డివిజన్ బెంచ్ దీనిని మరోసారి విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌కు రాష్ట్రాల హోంశాఖలే అనుమతులు మంజూరు చేస్తాయని, దీనికి కేంద్ర హోంశాఖ అనుమతులు అవసరంలేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు చెప్పారు.
ఈ అనుమతులకు సంబంధించిన పత్రాలను టెలిగ్రాఫ్ నిబంధనల ప్రకారం 6 నెలల్లో ధ్వంసం చేయాలని తెలిపారు. ఇదే కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ హయతుద్దీన్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. హయతుద్దీన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పిటిషనర్ కూడా బాధితుడేనని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో పిటిషనర్‌తోపాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని నాటి డీజీపీకి స్వయంగా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని చెప్పారు. స్పందించిన ధర్మాసనం ఇది సుమోటో పిటిషన్ అని, ప్రతివాదిగా చేర్చాలనే వ్యవహారంపై తదుపరి విచారణలో తేల్చుతామని చెప్పింది. విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో కౌంటరు దాఖలు చేయాలని భావిస్తే చేయవచ్చని కేంద్రానికి సూచించింది.
62 హార్డ్ డిస్క్‌లు ధ్వంసం
ఫోన్ ట్యాపింగ్ కేసులోని నిందితులు ట్యాపింగ్ డాటాతోపాటు ఎస్‌ఐబీకి సంబంధించిన 62 హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయడంతో కీలక సమాచారం మాయమైందని దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొన్నారు. ఎస్‌ఐబీలోని క్యాట్, యూఎఫ్ టీంల సమాచారాన్ని కూడా తొలగించారని, వీటితోపాటు 3 సర్వర్లను, 5 యాపిల్ హార్డ్ డిస్క్‌లను తొలగించారని వివరించారు. ఎందరో పోలీస్ అధికారులు ప్రాణాలొడ్డి సేకరించిన మావోయిస్టుల సమాచారాన్ని ధ్వంసం చేయడం ద్వారా దేశ అంతర్గత భద్రతకు ముప్పు తెచ్చారని ఆరోపించారు. రాజకీయ నేతల సీడీఆర్‌ల సమాచారాన్ని ప్రణీత్‌రావు తన వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లో భద్రపరిచారని, హార్డ్ డిస్క్‌ను తన బావమరిది దిలీప్ సహకారంతో తారుమారు చేశారని తెలిపారు.
తొలగించిన హార్డ్ డిస్క్‌ను బేగంపేట నాలాలో పడేశారని చెప్పారు. ఐన్యూస్ నిర్వాహకుడు శ్రవణ్‌రావుతోపాటు నవీన్‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌రావు టీం ట్యాప్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, దీన్ని కొనసాగించడానికి విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావును విచారించాల్సి ఉందని చెప్పారు. అందువల్ల వారిని రప్పించడానికి ప్రయత్నాలు చేపట్టినట్లు వివరించారు.
కేటీఆర్, నవీన్‌రావు తదితర బీఆర్‌ఎస్ అగ్రనేతల ఆదేశాలమేరకు ప్రభాకర్‌రావు సైబరాబాద్ పోలీసులపై ఒత్తిడి తెచ్చి నిర్మాణదారు అయిన శ్రీధర్‌రావుపై క్రిమినల్ కేసులు పెట్టించారని, బీఆర్‌ఎస్‌కు రూ.13 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లను శ్రీధర్‌రావు కొనుగోలు చేసినా వేధింపులు తప్పలేదని తెలిపారు. ప్రణీత్‌రావు వాంగ్మూలం ఆధారంగా ఐన్యూస్ సంస్థ నిర్వాహకుడు శ్రవణ్‌రావు ఇంట్లో సోదాలు నిర్వహించి పలు డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కలిపి 42 వస్తువులను జప్తు చేసినట్టు వివరించారు. ప్రభాకర్‌రావు ఇంట్లో సోదాలు చేసినా ఆధారాలేవీ లభించలేదని తెలిపారు. కావాలనే అన్ని ఆధారాలను మాయం చేశారని ఆరోపించారు.
ప్రముఖుల ఫోన్లు ట్యాప్
అనేక మంది ప్రముఖల ఫోన్లను నాడు ట్యాప్ చేశారని కౌంటర్‌లో పేర్కొన్నారు. 2023 నవంబర్ 2న కొన్ని ఫోన్ నంబర్లను ట్యాప్ చేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు లేఖ రాసి అనుమతులు తీసుకున్నారని తెలిపారు. సాధారణం గా ఏయే ఫోన్ నంబర్లను ఇంటర్‌సెప్ట్ చేశారనే సమాచారాన్ని సర్వీస్ ప్రొవైడర్లు తిరిగి ఎస్‌ఐబీ ఐజీపీకి పంపిస్తుంటారు. నవంబర్ 2 నాటి అనుమతుల సమాచారం డిసెంబర్ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్‌ఐబీ ఐజీ కార్యాల యానికి అందగా, అప్పటికే ప్రభాకర్‌రావు టీం ఎస్‌ఐబీని ఖాళీ చేసి వెళ్లిపోయింది. ఈ సమాచారం ప్రకారం తాజాగా ఫోన్ ట్యాప్ చేయా ల్సిన వారిలో గాలి అనిల్‌కుమార్, రామసహాయం సురేందర్‌రెడ్డి, కుందూరు రఘువీర్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, ఈటల రాజేందర్, ఆయన కెమెరామెన్, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, ఈటల గన్‌మెన్ అంజన్, ఫసిఖాన్, కే మహేందర్, నరేందర్‌రెడ్డి అనుమాండ్ల, మహేశ్‌కుమార్‌గౌడ్ బొమ్మ, మానాల మోహన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.