తిమ్మాపూర్, ఫిబ్రవరి 6: ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఎలియాస్ తీన్మార్ మల్లన్న పై కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రెడ్డి సంఘం ప్రతినిధులు గురువారం ఎల్‌ఎండి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రెడ్డి కులస్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎల్‌ఎండి ఎస్‌ఐ వివేక్ కి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీగా ప్రజల ఓట్లతో ఎన్నికై కౌన్సిల్ లో ప్రమాణం చేసిన నవీన్ (తీన్మార్ మల్లయ్య) రాజ్యాంగ విరుద్ధంగా రెడ్డి కులస్తులను చులకనగా మాట్లాడి, కులాల పేరుతో దూషణ చేయడం, కులాల మధ్యన చిచ్చు పెట్టడం, ప్రజలను రెచ్చగొట్టడం పై ఎల్‌ఎండీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తిమ్మాపూర్ మండల రెడ్డి సంఘం ప్రతినిధులు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి, రామిడి మల్లారెడ్డి, పాశం అశోక్ రెడ్డి, మధుకర్ రెడ్డి, పాపిరెడ్డి,రవీందర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తెలిపారు.
ఈ సందర్భంగా రెడ్డి సంగం ప్రతినిధులు భాస్కర్ రెడ్డి, అశోక్ రెడ్డి,లు మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న రెడ్డి కులస్తుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని లేని పక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. దమ్ముంటే రాజీనామా చేసి రెడ్డి ఓట్లతో ప్రమేయం లేకుండా గెలవాలని తీన్మార్ మల్లన్నకు సవాల్ విసిరారు.