మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనపాక నియోజకవర్గ పరిధిలోని కరకగూడెం మండలం నీలాద్రి పేట వలస గిరిజన గుత్తికొయ గ్రామంలో బుధవారం కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించారు. ఆదర్శ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నీలాద్రిపేట గ్రామంలో నివసించే గ్రామస్తులకు దుస్తులు, బెడ్ షీట్స్, చాపలు, వాటర్ బాటిల్స్, డోర్ కర్టెన్స్, బ్యాగులను కరకగూడెం పోలీసులు పంపిణీ చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వలస గుత్తి కోయ గ్రామస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం, అభివృద్ధి కొరకు పాటుపడాలనే ధ్యేయంతో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రామ్ లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏడూళ్ల బయ్యారం సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. అభివృద్ధి నిరోధకులైన నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎలాంటి సహాయ, సహకారాలు అందించకూడదని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసు వారికి తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లుతో పాటు కరకగూడెం ఎస్సై రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.