calender_icon.png 22 October, 2024 | 5:01 AM

శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యం: కలెక్టర్ జితేష్ వి పాటిల్

21-10-2024 08:55:39 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): శాంతియుత సమాజమే పోలీసుల లక్ష్యంగా పనిచేస్తూ పటిష్టమైన శాంతి భద్రతలతోనే అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం పోలీసుల అమరవీరుల దినోత్సవం కొత్తగూడెం పట్టణ పరిధిలోని హేమచంద్రపురం లో గల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ... శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా సంఘ విద్రోహుల శక్తులచే పోరాడి చనిపోయిన పోలీసులకు అమరవీరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరువీరుల త్యాగాలు మరవ లేనివి.

దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటూ వారిని స్మరించుకోవడం జరుగుతుందన్నారు. ప్రజల సంరక్షణ కోసం పోలీసు వ్యవస్థ నిరంతరం పనిచేస్తుందని శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, దేశం అంతర్గత భద్రత, ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి సందర్భంలోనూ పోలీస్ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తీవ్రవాదుల సంగ విద్రోహశక్తుల చేతిలో అమరులైన 214 మంది పేర్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్ టి సాయి మనోహర్ చదివి వినిపించారు ఈ కార్యక్రమంలో డీఎస్పీలు చంద్రభాను రెహమాన్ మల్లయ్య స్వామి రవీందర్ రెడ్డి సతీష్ కుమార్ ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.