calender_icon.png 24 October, 2024 | 7:53 PM

పబ్బులు, బార్లలో పోలీసుల తనిఖీలు

09-07-2024 03:55:31 AM

మాదక ద్రవ్యాలను ప్రొత్సహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరికలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని గతంలోనే స్పష్టం చేశారు. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్‌లోని పలు  పబ్బులు, బార్లలో ఆదివారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యా లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నార్కోటిక్ బ్యూరో పోలీసులు శిక్షణ ఇచ్చిన స్నిఫర్ డాగ్స్ సాయంతో సోదాలు నిర్వహించారు. పబ్బులు, బార్లలో డ్రగ్స్, మాదక ద్రవ్యాల గురించి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. 

పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి: డీజీపీ రవిగుప్త

ఖాజాగూడలోని కేవ్ బార్ అండ్ లాంజ్ లో శనివారం రాత్రి సైకడాలిక్ థీమ్ పార్టీ జరుగుతుండగా పోలీసులు ఆకస్మిక దాడు లు చేసి పార్టీలో పాల్గొన్న వారందరికి డ్రగ్ పరీక్షలు నిర్వహించి, పాజిటివ్ వచ్చిన 24 మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అధికారులు పబ్‌ను సీజ్ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ రవి గుప్త ట్విట్టర్(ఎక్స్) వేదికగా పబ్స్, బార్స్ నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను ఏ మాత్రం ప్రోత్సహించినా అత్యంత కఠిన చర్యలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ప్రాపర్టీస్ సీజ్ చేస్తా మని, డ్రగ్స్ సరఫరా చేసిన వారు, వాడిన వారు సైతం ఊచలు లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే తల్లిదండ్రులు తమ టీనేజ్ పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారు వాడుతున్న ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలన్నారు. మంచి,చెడు మధ్య తేడా తెలియని టీనేజ్ పిల్లలనే డ్రగ్స్ మాఫియా టార్గెట్ చేస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ మహమ్మారిని ఉక్కుపాదంతో అణచివేయడం తమ మొట్టమొదటి ప్రాధాన్యత అని డీజీపీ పేర్కొన్నారు.