calender_icon.png 15 January, 2025 | 12:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీ నగలను పోలీసులు సీజ్ చేయ్యొచ్చు

14-01-2025 02:08:38 AM

‘మణప్పురం’ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): బీఎన్‌ఎస్ సెక్షన్ 102 ప్రకారం చోరీకి గురైన బంగారు నగలతో పాటు ఇతర విలువైన వస్తువులను సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని హైకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. చోరీ నగలను స్వాధీనం చేయాలంటూ పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ దాఖలు చేసిన పలు పిటిషన్లను కొట్టివేసింది.

తెలిసిన వివరాల ప్రకారం.. నగదును స్వాధీనం చేసిన పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ 2021లో 16 పిటిషన్లు దాఖలు చేసింది. వాటిపై సోమవారం జస్టిస్ బి.విజయేసేన్‌రెడ్డి విచారణ చేపట్టగా, పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మణప్పురం సంస్థ నగలు తాకట్టు పెట్టుకుని, ప్రజలకు రుణాలు అందిస్తున్నదన్నారు.

రుణం ఇచ్చే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన ధ్రువపత్రాలు తీసుకుంటుందన్నారు. పోలీసుల నోటీసు ప్రకారం నగలను రుణం స్వీకరించిన వ్యక్తి అప్పగిస్తే, ఇక ఆ రుణాన్ని సంస్థ వసూలు చేసుకుంటుందని ప్రశ్న సంధించారు. చోరీ కేసుల విచారణ వెంటనే పూర్తయ్యే తతంగం కాదని, పోలీసులు తరచూ కంపెనీ అధికారులను పిలిచి వేధిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

తర్వాత ప్రభుత్వం తరఫున న్యాయవాది మహేశ్ రాజే వాదనలు వినిపిస్తూ.. మణప్పురం దాఖలు చేసిన పిటిషన్లు విచారణార్హమైనవి కావన్నారు. చోరీ సొత్తును స్వాధీనం చేయాలని నోటీసులు ఇచ్చే అధికారం పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. దర్యాప్తు దశలోనే పిటిషన్ వేయడం సరికాదని, ఒకవేళ కోర్టు ఏమైనా ఉత్తర్వులు జారీ చేస్తే, దర్యాప్తుకు అడ్డంకిగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి చోరీ సొత్తును సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉందని తీర్పునిస్తూ, పిటిషన్లను కొట్టివేసింది. గతంలోనూ కర్ణాటక హైకోర్టు అలాంటి కేసును కొట్టివేసిందని గుర్తుచేశారు. అలాగే మణప్పురం కంపెనీకి కూడా ప్రత్యామ్నాయ అవకాశాలు ఉన్నాయని, నగలను విడుదల చేయాలని బీఎన్‌ఎస్ సెక్షన్లు 451, 457 కింద కింది కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. వాటిపై చట్టప్రకారం మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. 

నోటీసులపై వివరణ వచ్చే అవకాశం ఇవ్వాలి: హైడ్రాకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాం తి): ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ హైడ్రా ఈ నెల 10న ఓ వ్యక్తికి నోటీసులు జారీ చేసింది. హైకోర్టు ఆ పిటిషన్‌ను విచారించి.. బాధితులు ఇచ్చిన వినతి పత్రంపై నిర్ణయం వెలువరించాకే తదుపరి చర్యలు తీసుకోవాలని హైడ్రాకు ఆదేశాలు జారీ చేసింది. నోటీసులిచ్చిన తర్వాత, బాధితులు వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా హడావుడిగా చర్యలు చేపట్టడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది.

వారు వివరణ ఇచ్చిన తర్వాత నాలుగు వారాల్లో పరిష్కరించాలని, లేదంటే తర్వాత చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తెలిసిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అల్మాస్‌గూడలోని ఓ ప్రాంతంలో నిర్మాణాలు తొలగించాలంటూ ఈనెల 10న హైడ్రా జక్కిడి అంజిరెడ్డికి నోటీసులు ఇచ్చింది. వాటిని సవాలు చేస్తూ అంజిరెడ్డి సోమవారం హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను జస్టిస్ కె.లక్ష్మణ్  అనుమతించి మధ్యాహ్నం విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది కె.విజయ భాస్కర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సదరు భూమి పిటిషనర్ వ్యవసాయ భూమి అని, భూమికి సంబంధించిన పాస్‌బుక్ సైతం పిటిషనర్ వద్ద ఉందన్నారు. 2012లో గ్రామ పంచాయతీ అనుమతులతో పిటిషనర్ కట్టడం నిర్మించి అద్దెకు ఇచ్చాడన్నారు. ఆ కట్టడానికి ఇంటి నంబరు ఉందని, ఆస్తి పన్ను సైతం చెల్లిస్తున్నారని స్పష్టం చేశారు. పిటిషనర్ భూ వినియోగ మార్పిడి ప్రక్రియ సైతం పూర్తి చేశాడన్నారు.

ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణం ఉందని హైడ్రా ఈ నెల 10న పిటిషనర్‌కు నోటీసులు జారీ చేసిందని, వాటిపై వినతి పత్రం సమర్పించేందుకు పిటిషనర్ కార్యాలయానికి వెళ్లగా, అక్కడ ఎవరూ అందుబాటులో లేరని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి హైడ్రా నోటీసుకు వివరణ ఇవ్వడానికి ఈనెల 17వ తేదీ వరకు పిటి షనర్‌కు గడువు ఇవ్వాలని, వాటిని నాలుగు వారాల్లో పరిష్కరించి నిర్ణయం వెలువరించాకే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు.

వ్యక్తిగత హోదాలో కౌంటర్ వేయండి

రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాం తి): ప్రభుత్వ భూములకు సంబంధించిన వ్యవహారాల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడు తున్నారని, వివాదాస్పద లావాదేవీలకు సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలపై వ్యక్తిగత హోదాలో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

తెలిసిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయ్‌పోల్ గ్రామంలోని సర్వే నెం.221లోని 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి రక్షణలో అధికారులు విఫలమవుతున్నారంటూ ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశా రు. పిటిషన్‌ను సోమవారం జస్టిస్ సి.వి.భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వానికి చెందిన 3.20 ఎకరాల భూమిని శ్రీఇం దూ ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యం ఆక్రమించిదంటూ 2023 సెప్టెంబర్, 2024 మార్చిలో కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లను ఆశ్రయించినా, ఎవరూ స్పందించలేదన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్ విధి నిర్వహణలో అనైతికంగా వ్యవహరిస్తున్నారని, వివాదాస్పద లావాదేవీలకు సహకారం అందిస్తున్నారని ఆరోపించారు.

వాదనలను విన్న న్యాయమూర్తి రాష్ట్రప్రభుత్వంతో పాటు రెవెన్యూశాఖ అధికారులు, శ్రీ ఇందూ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించారు. సర్వే నెం.221లోని 3.20 ఎకరాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు నిర్వహించరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశా రు. నవీన్ మిట్టల్ వ్యక్తిగతంగా కౌంటర్ దాఖ లు చేయాలని సూచించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 4కు వాయిదా వేశారు.