శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌పేట్ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ నెల 5వ తేదీన జరిగిన మర్డర్ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నర్సింహారావు వెల్లడించారు. కేశవ్ బంగార్ (39) సారుక్ వాడి గ్రామం మహారాష్ట్రలో చెరుకు ఫ్యాక్టరీలో లేబర్‌గా పనిచేస్తున్నాడు. అయితే కేశవ్ తాను చేస్తున్న పని నచ్చకపోవడంతో 15 రోజుల కిందట నగరానికి వచ్చి హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో ఉంటూ లేబర్ అడ్డా వద్ద కర్ణాటకకు చెందిన సుమిత్, మద్దానికర్, నౌడ్గిలతో పరిచయం ఏర్పడింది. ఆరోజు వారికి ఎక్కడ పని దొరకలేదు. కానీ వారంతా మద్యం తాగాలనుకున్నారు. అయితే ఎవ్వరి దగ్గర డబ్బులు లేకపోవడంతో కేశవ్ ఫోనును కుదవ పెట్టి ఆరోజు వారంతా మద్యం తాగారు. యధావిధిగా తెల్లారి కూడా పనులకు వెళ్లి తిరిగి రైల్వే స్టేషన్‌లో అందరూ కలుసుకున్నారు. ఈ క్రమంలో నా ఫోన్ తిరిగి ఇప్పించాలని కేశవ్ ఇద్దరు సమిత్, మద్దానికర్‌లను కొట్టాడు. దీంతో వారు నౌడిగిను పిలిచారు. దీంతో ముగ్గురిని కొట్టాడు. ఎలాగైనా కేశవ్‌ను అంతమొందించాలనుకున్నారు. దీంతో పెద్ద ఇటుక రాయితో కేశవ్‌ను తలపై కొట్టారు. కేశవ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఏసీపీ పేర్కొన్నారు.