19-04-2025 09:03:38 PM
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని పట్టుకున్న పోలీసులు...
మూడు కార్లు, 8 సెల్ ఫోన్లు, రూ.11.500 సీజ్...
మనోహరాబాద్: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కూచారం - జీడిపల్లి గ్రామాల మధ్యలో ఉన్న వింటర్ గ్రీన్ ఫామ్ హౌస్ లో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఫామ్ హౌస్ లో పేకాట ఆడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద ఉన్న వాహనాలను, సెల్ ఫోన్లను, నగదును సీజ్ చేసినట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఉన్నాయి. నమ్మదగిన సమాచారం మేరకు తూప్రాన్ సిఐ రంగాకష్ణ ఆధ్వర్యంలో ఈ ఫామ్ హౌస్ లో దాడులు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని ప్యాక్ పత్తాలను, మూడు కార్లు, 8 సెల్ ఫోన్లు, రూ. 11,500 నగదును స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్న ఈ కూచరం, జీడిపల్లి ప్రాంతాలలో వెలసిన ఫామ్ హౌజను నగరానికి చెందిన కొంతమంది ఉద్యోగులు, ఇతరులు శనివారం, ఆదివారం సెలవులు ఉండడంతో వాటిని బుక్ చేసుకుని తాగుడుతో పాటు జల్సాలు ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ప్రాంతాలలో పుట్టగొడుగుల్లా వెలసిన ఫామ్ హౌస్ లో జల్సా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు. రాత్రి వేళలో సైతం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు రాత్రి వేళల్లో ఈ ఫామ్ హౌస్ లపై దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.