తిరువంతపురం: కేరళలోని పతనంతిట్ట జిల్లా(Pathanamthitta district)లో 18 ఏళ్ల దళిత యువతిపై ఏళ్ల తరబడి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 59 మందిలో 57 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కస్టడీకి తీసుకున్న చివరి నిందితుడు 25 ఏళ్ల వ్యక్తిని ఆదివారం ఉదయం అతని ఇంటి నుండి అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు చీఫ్ విజి వినోద్ కుమార్ మీడియాకి తెలిపారు. 13 సంవత్సరాల వయస్సు నుండి 62 మంది వ్యక్తులు తనను బ్లాక్‌మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. టీచర్లు ఆమె ప్రవర్తనలో మార్పుల గురించి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి(Child Welfare Committee) తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కమిటీ కౌన్సెలింగ్‌లో వేధింపుల స్థాయిని బాలిక వెల్లడించడంతో పోలీసులకు సమాచారం అందించింది. జనవరి 10న ఇలావుంతిట్ట పోలీస్ స్టేషన్(Elavanthitta Police Station)లో కేసు నమోదైంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఇద్దరు మినహా మిగిలిన నిందితులందరినీ సమగ్ర విచారణ ద్వారా అరెస్టు చేసినట్లు జిల్లా పోలీసు చీఫ్ కుమార్ తెలిపారు. ఆయన పర్యవేక్షణలో మహిళా ఐపీఎస్ అధికారిణి ఎస్ అజితా బీగం నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు దర్యాప్తు చేస్తోంది. బాధితుల వాంగ్మూలం ఆధారంగా జిల్లాలోని నాలుగు పోలీస్ స్టేషన్లలో ఇప్పటి వరకు 30 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మైనర్లు(Minor) తనను లైంగిక వేధింపులకు గురి చేశారని బాలిక వెల్లడించింది. జిల్లాలోని ఓ ప్రైవేట్ బస్టాండ్‌లో పలువురు నిందితులు బాధితురాలిని కలిశారని విచారణలో తేలింది. అనంతరం ఆమెను వాహనాల్లో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి దుర్భాషలాడినట్లు పోలీసులు తెలిపారు.