దౌల్తాబాద్, (విజయక్రాంతి): శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ పోలీస్స్టే షన్ లో విద్యార్థినిలకు పోలీస్ స్టేషన్ విధి విధానాలు ఉపయోగించిన టెక్నాలజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, ఆయుధాల గది, కంప్యూటర్ గది, బ్లూ కోట్స్, పోలీసులు నిర్వహించే విధుల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగితే పోలీసుల అవసరం తప్పనిసరిగా ఉందని అనుకుంటే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. విద్యార్థిదశ చాలా కీలకమని క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. చదువుకున్న సమయంలో అవసరమైన మేరకే సెల్ ఫోన్ వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేషయ్య, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.