calender_icon.png 19 March, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాత్రి వేళ పోలీసుల హల్‌చల్

19-03-2025 01:42:41 AM

కారును ఆపి రూ.10 వేల వసూలు

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 18 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి నుంచి రాగబోపోయినాగూడెం వెళ్లే మార్గంలో మంగళవారం తెల్లవారుజామున ఇద్దరు కానిస్టేబుళ్ల ఓ కారును ఆపి డబ్బులు వసూలు చేశారు. టేకులపల్లికి చెందిన ధరావత్ జితేందర్‌కు టేకులపల్లిలో శ్రీ లక్ష్మీరైస్‌మిల్లు, ఇల్లందు మండలం రాగబోయిన గూడెంలో శ్రీ పద్మజ రైస్ మిల్లు ఉన్నాయి.

వ్యాపారం నిమిత్తం తెల్లవారుజామున కారులో వెళ్తుండగా టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు వాహనాన్ని అడ్డగించారు. తాళాలు, సెల్ ఫోను లాక్కొని కారును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి ఆధారాలు లభ్యం కాకపోవడంతో, నువ్వు దొంగ వ్యాపారం చేస్తున్నావ్ అంటూ బెదిరిస్తూ తనను కొట్టడానికి ప్రయత్నించారు.

చివరకు రూ.20 వేలు డిమాండ్ చేసి, రూ.10 వేలు తీసుకొని కారు తాళాలు, సెల్‌ఫోన్ ఇచ్చారు. తనకు జరిగిన అన్యాయంపై టేకులపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు సీఐ సురేష్ తెలిపారు. డబ్బులు వసూలు చేసిన వారిలో ఓ కానిస్టేబుల్ సురేష్, మద్యం సేవించి ఉన్న మరో కానిస్టేబుల్ ఉన్నట్టు తెలిసింది.