పోలీస్ ఉన్నత అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు ఊరేగింపులు చేయొద్దు -జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, (విజయ క్రాంతి): జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు నేటి నుంచి 01 జనవరి 2025 వరకు జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. ఈ 30 పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు చేయకూడదని తెలిపారు.
నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను, జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, ధరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈ సమయంలో నిషేధించడం జరిగిందని తెలియజేశారు. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ యాక్ట్ 1861 కింద శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. ప్రజలు చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో సంతోషంగా ఉండాలని తెలిపారు.