వ్రతాలు, నోములు పూజలతో ఏ ఇంట చూసినా పిండివంటలతో సందడే సందడి
మంథని, (విజయక్రాంతి): పోచమ్మ తల్లిని ఆరాధించే పండుగ పొలాల అమావాస్య. ఈ పండుగ రోజున తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో ఏ ఇంట చూసిన వ్రతాలు నోములు పూజలతో సందడిగా ఉంటుంది. శ్రావణమాసంలో వచ్చే బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత వుంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతమును ఆచరిస్తారు. వివాహ అయి చాలాకాలం ఐనా సంతానం కలుగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసం, పిల్లల యోగ క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం శ్రావణ అమావాస్యనాడు పోలాల అమావాస్య వ్రతం తప్పక చేయాలి. అదేవిధంగా వ్యవసాయదారులు గోవులను పాలించువారు. తమ ఆవులు ఎద్దులకు ఈ రోజున విశేష పూజలు నిర్వహించడం ఆనవాయితీ. గ్రామాల్లో ఆవులు ఎద్దులకు కడుపునిండా తిండి నీరు తాగించి ఎలాంటి పనులు చేయించకుండా బాగా మేపే అమావాస్యగా పెద్దలు చెబుతారు. భారతీయ సంస్కృతిలో ఆవులు ఎద్దులను పూజించడం సాంప్రదాయంగా వస్తుంది. అలాంటి సాంప్రదాయాలను నేటికీ గ్రామాల్లో పొలాల అమావాస్య పండుగగా జరుపుకుంటారు.
పొలాల అమావాస్య వ్రత కథ... అనగా అనగా ఒక ఊర్లో ఓ బ్రహ్మణమ్మ . ఆమెకు ప్రతి సంవత్సరం పిల్లలు పుడుతున్నారు. పోతున్నారు. పుట్టగానే పోతున్న సంతానానికి ధుఖించి ఆ బ్రహ్మణమ్మ ఊరి వెలుపల పోచక్క తల్లి చుట్టు ప్రతి ఏట పిల్లల్ని బొంద పెడుతున్నది. ఈ పొలలమావాస్యకు పుడుతున్నారు. మళ్లీ పొలలమావాస్యకి చనిపోతున్నారు. నోముకుందామని ఎవర్ని పేరంటం పిలిచినా రామంటునారు. ఈ విధంగా బాధపడుతున్న ఇల్లాలుకు మళ్లీ ఎప్పటివలె సంతానం మైనది, చనిపోయింది.
ఆ పిల్లను తీసుకుని పోచమ్మ దగ్గర బొంద పెట్టేందుకు పోయింది. అప్పుడు పోచక్క తల్లి ఈ ఊర్లలో వాళంత నాకు మొక్కేందుకు వస్తారు. పాయసం, వడలు నైవేద్యం తెస్తారు. ఎడ్లకు రంగులు వేసి నెమలి పించం పెట్టి గాలి, ధూళి తగలకుండా ప్రదక్షణం చేయిస్తారు. పాలేర్లు కల్లు తెస్తారు. వాళ్ళ పెళ్ళాలు కడవలతో పానకం తెస్తారు. నువ్వెందుకు శవాలు నా చుట్టూ బొంద పెడుతున్నావని ప్రశ్నించింది.
అమ్మా! పోచక్క తల్లి వేయి కళ్ళ తల్లివి నీకు తెలియనిది ఏముంది. నేను పూర్వ జన్మలో ఏ పాపం చేసానో నాకు పుట్టిన సంతానం ఎప్పటికప్పుడు మరణిస్తున్నారు. అని బాధ పడింది. అప్పుడు పోచమ్మ తల్లి "బ్రహ్మణమ్మ పోయిన జన్మలో పొలలమావాస్య పేరంటాలు రాక ముందే పిల్లలు ఏడిస్తే ఎవరు చూడకుండా పాయసం, గారెలు పెట్టిందని, పులుసు తీపి సరిపోయిందో లేదో చవిచూసిందని, మడి, తడి లేకుండా అన్ని అమాంగిలం చేసిందని అందుకే ఆమె పిల్లలు అలా పుట్టి పెరిగి చనిపోయినారని" చెప్పింది.
తన అపరాధాన్ని తెలుసుకున్న బ్రహ్మణమ్మ పోచక్క తల్లి కాళ్ళమీద పడి తనను క్షమించమని వేడుకున్నది. అమ్మలక్కలు కలియుగం పుట్టనున్నది, పెరగన్నునది కనుక ఈ వ్రత విధానం మాకు తెలుపమని వేడుకోగా పోచక్క ఇలా తెలిపింది. "శ్రావణమాసం చివర భాద్రపద మాసం తొలుత వచ్చే అమావస్యని పొలలమావాస్య అంటారు. గోడను ఆవు పేడ పాలతో అలికి, పసుపు కుంకుమతో పొలాలు రాసి, కంద మొక్కని అమ్మగా భావించి 9 వరుసల దారంతో పసుపు కొమ్ము కట్టి, ఆ తోరం పోచక్క తల్లికి కట్టి పూజ చేయాలి.
9 వరుసల తోరం పేరంటాలకి ఇచ్చి మనము కట్టించుకోవాలి. పిండి వంటలు నైవేద్యం చేసి అమ్మకి నివేదన చేయాలి. భోజనం అనంతరం తాంబూలం దక్షిణ శక్తి కొలది సమర్పించాలి, ఇలా చేస్తే పిల్లలు మృత్యువాత పడకుండా కలరా, మలేరియా, మశూచి మొదలైన వ్యాధులు రాకుండా పోచక్క తల్లి కాపాడుతుందని " చెప్పింది. ఈ విధంగా బ్రహ్మణమ్మ ఈ వ్రతంని చేసి తన చనిపోయిన సంతానంని తిరిగిపొందింది.