10-03-2025 09:11:38 PM
ఏడుగురి అరెస్ట్, నగదు మొబైల్ ఫోన్లు స్వాధీనం...
ఘట్ కేసర్ (విజయక్రాంతి): గుట్టుచప్పుడు కాకుండా ఓయో హోటల్ లో తీన్ పత్త పేకాట బెట్టింగ్ గేమ్ ఆడుతున్న ఏడు మంది యువకులను అరెస్టు చేసి వారి వద్ద నుండి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న సంఘటన పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోచారం ఇన్ స్పెక్టర్ బి రాజు వర్మ తెలిపిన వివరాలు... పోచారం మున్సిపాలిటీ అన్నోజీగూడలోని నవ్య గ్రాండ్ ఓయో హోటల్ లో గదిని అద్దెకు తీసుకొని పేకాట అడుతున్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు దాడి జరిపారు.
దాడిలో ఘట్ కేసర్ పట్టణానికి చెందిన మమ్మద్ అబ్బాస్ అలీ(37), గుండు సురేష్(25), తొర్పునూరి కిషన్(29), మామిండ్ల వెంకటేష్(38), గుండ్ల సిద్ధార్థ(35), ములుగు సంతోష్(31), ముధుగని మాధవ్(27) లను అరెస్టు చేశారు. పేకాట ఆడుతున్న నిందితులను అదుపులో తీసుకోవడంతోపాటు వారి వద్ద ఉన్న రూ. 27,600 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు.