calender_icon.png 14 November, 2024 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణాదిపై కమలం గురి

14-11-2024 01:41:01 AM

  1. ఉత్తరాదిలో దెబ్బతిన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయం
  2. గతంలోని ఎన్డీఏ మిత్రపక్షాలను కలుపుకునే యత్నం
  3. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా మారేందుకు అడుగులు

పెద్ది విజయ్‌భాస్కర్ :

హైదరాబాద్, నవంబర్ 13 (విజయక్రాంతి): సంప్రదాయంగా ఉత్తరాది రాష్ట్రాలను ప్రధాన ఓటు బ్యాంకుగా భావించే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రూటు మార్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరాదిలో ఊహించని విధంగా దెబ్బతిన్న బీజేపీ.. ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది.

అయోధ్యలో రామమందిరం నిర్మిం చినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఓటర్లను బీజేపీ ప్రసన్నం చేసుకోలేకపోయింది. ఇది ఆ పార్టీకి నిర్ఘాంతపోయే పరిణామమే. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని విధంగా తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నించింది.

మరోవైపు కేరళలో తొలిసారిగా ఒక ఎంపీ సీటు కైవసం చేసుకునడంతోపాటు ఓటు బ్యాంకును గణనీయంగా పెంచుకుంది. తమిళనాడులోనూ ఓటర్లను ఆకర్షించడంలో కమలనాథులు తొలిసారిగా సఫలమయ్యారు. కర్ణాటకలోనూ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మెరుగైన ఫలితాలు బీజేపీకి ఆశలను కలిగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కాషాయ పార్టీ నేతలకు ఇప్పుడు దక్షిణాదిన అత్యంత అనుకూల వాతావరణం కనిపిస్తోంది.

ఇక తెలంగాణలో అయితే బీఆర్‌ఎస్‌ను కాదని తామే బలమైన ప్రతిపక్షం అని నిరూపించుకునేందుకు కమలనాథులు ప్రత్యేక అజెండాతో ముందుకు కదులుతున్నారు. కొత్త ఏడాదిలో, రాష్ట్ర పార్టీకి నూతన అధ్యక్షునితో చురుగ్గా ముందుకు వెళ్లేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

ప్రధాన ప్రతిపక్షంగా..

తెలంగాణలో పార్టీ అధ్యక్షునిగా అత్యంత ప్రభావశీలుడైన వ్యక్తికి అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో పార్టీకి కొత్త అధ్యక్షుణ్ణి నియమించి కొత్త సంవత్సరంలో అత్యంత క్రియాశీలకంగా పనిచేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా కోసం బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తోంది. ప్రభుత్వంపై పోరులో ఎవరు ముందున్నారు అనే అంశంలో బీజేపీ క్లియర్‌గా వెనకబడినపోయినట్లుగా ఆ పార్టీ పెద్దలే భావిస్తున్నారు. అందుకే సరికొత్త ప్లాన్‌తో కొత్త ఏడాదిలో బీజేపీ అడుగులు వేయనుందని.. ఫలితంగా బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్ర బీజేపీ సొంతం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తునారు. 

దక్షిణాదిపై పట్టు కోసం..

ద్రవిడ వాదంతో తమిళనాడు డీఎంకే ప్రధాన నేతలు సనాతన ధర్మంపై విషం కక్కుతూ తలాతోక లేని వాదనలు చేయడంతో ఆ రాష్ట్రంలోని హిందువులు ఆ పార్టీకి దూరం జరుగుతున్నారు. అక్కడ అధ్యక్షునిగా ఉన్న అన్నామలైకి ఉన్న ఛరిష్మాతో రాష్ట్రంలో ఓట్ల శాతాన్ని బీజేపీ గణనీయంగా పెంచుకుంది. కొన్ని గెలిచే స్థానాల్లో కూడా పార్టీలో అంతర్గత విబేధాల వల్ల కోల్పోయిందనే భావన పార్టీ నేతల్లో ఉంది.

వీటన్నింటిని చక్కదిద్దుకుని తమిళనాట ముందడుగు వేసేందుకు అధిష్ఠానం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని సమాచారం. ఇక కేరళ వామపక్ష ప్రభుత్వం ఆ రాష్ర్టంలో సంఫ్‌ు పరివార్, ఇతర హిందూ సంస్థల, బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగినా చూసీచూడనట్టు వ్యవహరించిన అంశంపై ప్రజల్లోకి వెళ్లింది. తొలిసారిగా కేరళలో సురేష్ గోపి రూపంలో ఓ ఎంపీని పార్లమెంట్‌కు పంపించింది.

రాబోయే ఎన్నికల్లో కేరళలో మరిన్ని సీట్లు కైవసం చేసుకునేందుకు ప్లాన్ సిద్ధం చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై మతపరమైన దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదని బీజేపీ గట్టింగా ప్రచారం చేసింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టింది. ఫలితంగా 17 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని గత అసెంబ్లీ ఎన్నికల వైఫల్యాలను మరుగున పడేలా చేసింది.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌పై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరుగుతుందని ఫలితంగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో పూర్తిగా సత్తా చాటుతామనే నమ్మకంతో కమలనాథులున్నారు. ఇక ఏపీలో బీజేపీ 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేసి 11 శాతం పైగా ఓట్లతో అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురం స్థానాల్లో గెలిచింది.

ప్రస్తుతం టీడీపీ, జనసేనతో కలిసి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించేలా బీజేపీ ఆలోచన కనిపిస్తోందని.. అవసరమైతే పవన్ పార్టీని బీజేపీలో కలిపేసుకునేందుకు కూడా ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కొత్తగా హిందుత్వ నినాదాన్ని నెత్తిన ఎత్తుకున్న తరుణంలో బీజేపీలో విలీనమైపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని అంటున్నారు.

ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మరింత బలం పుంజుకుని సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారని తెలుస్తోంది. పార్టీకి ఉనికే లేదని విమర్శలు ఎదుర్కొన్న కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యర్థి పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది బీజేపీ. రాబోయే ఎన్నికల్లో ఓట్లు కాస్త సీట్లుగా మార్చుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

అన్నాడీఎంకేతో పొత్తు..

2019 లోకసభలో అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేసిన బీజేపీ 3.6 శాతం, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 3 శాతం లోపే ఓట్లను పొంది, 2024లో సొంతంగా 11 శాతానికి పైగా ఓట్లను సాధించింది. మొత్తం ఎన్డీఏ కూటమి రాష్ర్టంలో 18 శాతానికి పైగా ఓట్లను పొందింది. పొత్తులో భాగంగా 23 స్థానాల్లో పోటీ చేసిన బీజేపీ 9 స్థానాల్లో రెండో స్థానంలో నిలవడం చాలా గొప్పవిషయంగా చెబుతున్నారు.

అయితే 2024 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని బీజేపీ, అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్త పెట్టుకుని డీఎంకేను ఓడించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బీజేపీతో చేతులు కలుపబోమని అన్నాడీఎంకే నేతలు ఇప్పుడు చెబుతున్నా, పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి మారుతాయనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

తెలంగాణపై ప్రత్యేక దృష్టి..

తెలంగాణలో 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ అనంతరం ఒంటరి పోరుకు ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లతో ఒక్క సీటే గెలిచిన బీజేపీ, 5 నెలల వ్యవధిలో జరిగిన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో 4 స్థానాల్లో గెలిచింది.

తర్వాత జరిగిన జీహెచ్‌ఎమ్‌సీ ఎన్నికలలో ఎవరూ ఊహించని విధంగా గణనీయమైన సీట్లు సాధించి, హుజురాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ర్టంలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సంస్థాగత సమస్యలతో 13 శాతం ఓట్లతో 8 స్థానాలకే పరిమితమైంది. 6 నెలల వ్యవధిలో జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో 8 స్థానాల్లో గెలిచింది.

బీఆర్‌ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా గల్లీలో ఎవరున్నా.. ఢిల్లీలో మోదీయే ఉండాలనే లక్ష్యంతో ప్రజలు తీర్పు ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు పొందిన బీజేపీకి ఇప్పుడు బీఆర్‌ఎస్ బలహీనపడడం ఒక సదవకాశం. 8 స్థానాల్లో గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 56 అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పార్టీ బలోపేతానికి సంబంధిత ఎంపీలు కృషి చేస్తే సగం రాష్ర్టంలో పార్టీ పటిష్టపడినట్లే.

గెలిచిన 8మంది ఎంపీలు, రెండో స్థానంలో నిలిచిన మరో ఏడుగురు ఎంపీ అభ్యర్థులతో పాటు ఇప్పటికే ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసికట్టుగా సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసేలా పార్టీ అధిష్ఠానం వ్యూహాలు రూపొందిస్తున్నది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వెలుగొందేందుకు కసరత్తు మొదలైంది.

బీజేపీకి తెలంగాణలో అధికారం అందని ద్రాక్ష కాదని.. తమ బలం పెంచుకోవాలంటే ముందు ప్రజల్లో బీఆర్‌ఎస్ కనుమరుగు అయ్యిందనే భావన కల్పించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దక్షిణాదిలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయానికి గేట్‌వేగా తెలంగాణను ఆ పార్టీ నేతలు ఎంచుకుంటున్నారు.