కాసుల కక్కుర్తిలో పడి మనిషి తన మూలాలను మర్చిపోతున్న వైఖరికి అద్భుత ప్రయోగాలతో అక్షరబద్ధం చేశారు తగుళ్ల గోపాల్. ఒకప్పటి ఊళ్లలోని స్వచ్ఛమైన మనుషులు చేతికి దండ కడియం ధరించే వారు. అది వారికి అలంకరణగా, గౌరవంగానూ ఉండేది. అందుకే నేమో కవి ‘దండ కడియం’ శీర్షికతో వెలువరించిన సంపుటిలోని అన్ని కవితల్లోనూ తడి ఆరని కవిత్వాన్నే చదువుతాం. గ్రామాల్లోని స్వచ్ఛమైన ప్రేమబంధాల్ని రొటీన్ కవిత్వానికి భిన్నంగా ఆయన చెప్పుకొచ్చారు.
కవితలను చదువుతున్నంతసేపు మనం ఆ ఊరి వారి బంధాల చుట్టూ పెనవేసుకుపోతాం. వారి అపురూప భావోద్వేగాలకు బందీలమవుతాం. ‘నీ జ్ఞాపకాలను/ అంగీ జేబులో వేసుకుని/ బతుకు పోరుకు సిద్ధమవుతానా/ చిత్రంగా అవి గుండెను తాకి నడిపిస్తాయి’ (పేజీ 46) అంటారు నాన్న గురించిన ఒక కవితలో. ప్రతి మనిషికి రియల్ హీరో తండ్రి. తానే గురువై, స్నేహితుడై, ఆప్తుడై, ధైర్యమై జీవితానికి రహదారిగా మారి, మనలను ముందుకు నడిపిస్తాడు.
తండ్రి ప్రేమ మనకు తెలియాలంటే మనం తండ్రైతేనే కానీ తెలియదు. నాన్న గురించిన మరో కవిత ‘నాన్న గొడ్డలి’ (పేజీ: 115 ). తన పిడికిలో ఎప్పుడూ కనిపించే గొడ్డలి గురించి చెబుతూ, ‘నాన్న అరచేతి రేఖల్ని ముద్దాడి/ మా నుదుటి రాతల్ని మార్చింది/ మా ఇంట్లోని పేదరికం/ అంతా కొంచెం కొంచెంగా నరుక్కుంటూ వచ్చింది’ అంటారు గొడ్డలి అనే ఆయుధం గురించి. అమ్మపై రాసిన కవితలో (గంజి: పేజీ 51) ‘అమ్మా../ బతుకుమీద ఆశ చస్తుంది/ వెచ్చని గంజి వోసి, ఇంత దొడ్డుప్పు కలిపి/ మళ్ళీ నన్నూ బతికించవే..’ అంటారు. అమ్మ అంటేనే అనురాగపు స్పర్శ కదా.
బతుకుని ఎలా ప్రేమించాలో ఈ కవికి బాగా తెలుసు. జీవితం అన్నాక దుఃఖం ఉంటుందని, కనపడని దుఃఖాన్ని కడుపులో దాచుకొని ఎవరి ముందైతే నీ భారం దిగుతుందో వాళ్ళముందు ఆ దుఃఖపు గంపను దింపుకోవాలని సూచించారు ‘దుఃఖపు గంప’ (పేజీ: 43) కవితలో.
వృద్ధులను చిన్నచూపు చూస్తున్న యువతరాన్ని నిలబెట్టి ప్రశ్నించారు. ‘మాటల పావురాలు’, ‘మా బంగారానివి కదూ’ వంటి మొత్తం 56 కవితల్లోనూ బతుకు తడిలోని ఆర్ద్రతను ఎంతో గొప్పగా చెప్పారు గోపాల్. పుస్తకంలోని కవితల్ని చదువుతున్నంత సేపు మన మనసుకి ఒక విధమైన ఊరట లభిస్తుంది.
(‘దండ కడియం’, తగుళ్ల గోపాల్, పేజీలు: 164, వెల: రూ.150/ ప్రతులకు: కవి సంగమం పబ్లికేషన్స్ లేదా 9505056316)