calender_icon.png 8 April, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవరస బంధుర కావ్య నిర్మాత అద్దంకి గంగాధర కవి

31-03-2025 12:00:00 AM

“మున్నిటి సంస్కృత కవులను 

విన్నాణపు దెలుగుకవుల వేడుక మీరన్

సన్నుతులొనర్చి, యాధుని

కోన్నత సత్కవులనూర్జిత మతినై”

అంటూ తనకు పూర్వ సంస్కృతాంధ్ర కవు ల కావ్యాలతోనే గాక సమకాలీన కవులతోనూ సంబంధం ఉన్నట్టు చెప్పుకున్న కవి అద్దంకి గంగాధరుడు. ఈయన 16వ శతాబ్ద పు కవి. గోల్కొండ రాజ్య పాలకులైన కుతుబ్‌షాహీలకు చెందిన రాజు ఇబ్రహీం ఆస్థానకవి గంగాధరుడు. ఆయన ‘ఇభరాముని’గా, ‘మల్కిభరాముని’గా కీర్తి పొందాడు. కుతుబ్‌షా హీల కాలంలో తెలుగు సాహిత్యంలో అనేక కావ్యాలు అవతరించినట్లు, ఆ సుల్తానులే గాక వారివద్ద అధికారులు కూడా తెలుగు కవులను పోషించినట్లు చరిత్ర చెబుతున్నది.

కుతుబ్‌షా ఆస్థానకవిగా..

నాటి పరిపాలకుడైన ఇబ్రహీం కుతుబ్‌షా కు అద్దంకి గంగాధరుడు మిక్కిలి సన్నిహితు డు. విజయనగర పాలకుడైన అళియ రామరాయల ప్రాపకంలో పెరిగిన ఇబ్రహీం కుతు బ్‌షా తెలుగన్నా, తెలుగు కవులన్నా ప్రీతి కలిగిన వ్యక్తి. అందుకే, తాను గోల్కొండకు పాల కుడు కాగానే తనకు సన్నిహితుడైన గంగాధర కవిని తన ఆస్థానకవిగా, నియమించి గౌరవించుకున్నాడు.

“పెక్కు కృతుల్ చమత్కృతులు బెంపుగ నందితిగాని, నీదు స

మ్యక్కృతి కన్యపైగల మమత్వము 

వర్తిలదందు, లెక్కకుం

బెక్కువగాగ గోపికలు మించి 

వసించిననేమి, రాధపై

మక్కువ ఎక్కువై మిగుల మన్ననసేయడె శౌరి వేడుకన్‌”

అని తన అంతరంగాన్ని వ్యక్తపరచి ఇబ్ర హీం కుతుబ్‌షా తనకొక ప్రత్యేక కావ్యం అం కితం చెయ్యమని కోరుకున్నాడు.

‘తపతీ సంవరుణుల’ ఇతివృత్తం

తమ సన్నిహితుడు, గోల్కొండ ప్రభువైన ఇబ్రహీం కుతుబ్‌షా కోరిక మేరకు గంగాధరుడు ‘మహాభారతం’లోని ‘తపతీ సంవరు ణుల’ ఇతివృత్తాన్ని స్వీకరించి, విస్తృత పరచి దాదాపు 500 గద్య పద్యాలను కూర్చి, గొప్ప శృంగార రసభరిత కావ్యంగా నిర్మించాడు. కేవలం శృంగార రసమేగాక కావ్యాన్ని నవరస బంధురంగా తీర్దిదిద్దాడు అద్దంకి గంగాధర కవి. ఇందులో ప్రబంధ లక్షణాలైన అష్టాదశ వర్ణనలూ చోటుచేసుకున్నాయి. ధారాళమైన శైలీ విన్యాసం, రమ్యతరమైన అపురూప కల్పనలు, చక్కనైన శబ్దాలంకారాలు కలిగిన ఈ కావ్య నిర్మాణం క్రీ.శ. 1550 మధ్యలో జరిగి ఉండవచ్చునని సాహిత్య చరిత్రకారులు భావించారు. ‘అద్దంకి వీరయామాత్యుడు ఈయన తండ్రి, కేదారశ్రీ ఈయనకు గురు వు’ అన్న రెండు విషయాలు మాత్రమే గంగాధర కవికి సంబంధించినవి తెలుస్తున్నాయి.

“గంగాధర సుకవీంద్ర! య

భంగుర భవదీయ వాక్యపద 

గుంభనముల్

గంగాధర మౌళి నట

ద్గంగా తటినీ తరంగ గంభీరంబుల్‌”

అన్న పద్యం ద్వారా

“తిన్నని పదముల నడవడి

జెన్నయి పలుకులను 

రసము చిప్పిలు చుండన్

సన్నపు వార్త నటించగ

నన్నువ సతివోలె గవిత యమరగ వలదే”

అంటూ చెప్పిన పద్యాలవల్ల గంగాధరుడు తన కవితా వైదుష్యం తెలిపాడు. “కేదార శ్రీ గురువర పాదాంభో జాతములకు బ్రణతియొనర్తున్‌” అన్న మాటలనుబట్టి ఈ చిన్న వివరమే లభిస్తున్నది. కావ్యావతారికలోగాని, ఆశ్వాసాంత పద్యాల్లోగాని, ఇంత కు మించిన ఆయన వ్యక్తిగత వివరాలు ఏమీ సాహిత్య చర్రితకారులకు అందుబాటులోకి రాలేదు.

గొప్ప ప్రబంధం

ప్రబంధ యుగంగా భావిస్తున్న కాలంలో వెలువడ్డ ‘తపతీ సంవరణోపాఖ్యానం’ సమస్త ప్రబంధ లక్షణాలను సంపూర్ణంగా కలిగి ఉంది. “16వ శతాబ్దంలో వెలువడ్డ కావ్యాలకే ప్రబంధాలు అనే రూఢి ఏర్పడ్డది” అన్న గురిజాల రామశేషయ్య అభిప్రాయాన్నిబట్టి కూడా దీన్ని ప్రబం ధంగా పరిగణించే అవకాశం ఉంది. అంతేకాదు, ఆయనే పేర్కొన్నట్టు, “ప్రఖ్యాతమైన ఇతివృత్తాన్ని స్వీకరించి వర్ణనాదుల బెంచి, శృంగార రస బంధురంగా, స్వీయ కల్పనా చమత్కృతిలో ప్రబంధంగా తీర్చిదిద్దడమే ప్రబంధ కవి రచనా పద్ధతి” అన్న మాటలు గంగాధర కవి రచనకు సంపూర్ణంగా అన్వయిస్తాయి. కృతి కర్త అయిన ‘ఇభరాముడే’ స్వయంగా “భారతాఖ్యానము నందు గలుగు తాపత్య చరితంబు ఘనత సరసి వివిధ శృం గార మహిమల విస్తరించి కబ్బ మొనరింపు నా పేర కవి వరేణ్య” అన్న మాటలు కూడా ఈ విషయాన్నే ధ్రువపరిచాయి. వేదాలు, మీమాంసా శాస్త్రం వంటి వాటిని బాగా చదువుకున్న పండిత కవి అయి న అద్దంకి గంగాధరుని రచన గొప్ప ప్రబంధమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

అసదృశ ప్రతిభ 

ప్రకృష్టమైన బంధమే ప్రబంధం. కనుకనే, కావ్యంలోని వస్తలంకార విషయాల్లోను, కమనీయ కవితా నిర్మాణంలోను, వర్ణనా నైపుణ్యంలోను పరిశీలిస్తే అద్దంకి గంగాధర కవి ప్రతిభ ద్యోతకమవుతంది.

“ఘన వితతి స్ఫురత్పదవిగై కొని రాజు తమః కదంబంకం

బను కుజన వ్రజంబు డెగటార్చి 

దిశాచయ సాధు మండలం

బొనర వెలుంగ జేసె, నదియుక్తమె కాదె, నృపాల ధర్మ వ

ర్తనునకు శిష్ట దుష్ట పరిరక్షణ 

శిక్షణ దక్షిణ క్రియల్‌”

అన్న ఒక్క పద్యం పరిశీలిస్తే చాలు, కవి ప్రతిభ ఎంతటిదో తెలుసుకోవచ్చు. 

ఈ పద్యంలో ‘రాజు’ అనే శబ్ద ప్రయోగం తో శ్లేష సాధించి, ప్రజల కడగండ్లను దూరం చేసే పాలకుణ్ణి ‘తమః’ శబ్దంతో కష్టాలను, చీకట్లను కూడా శ్లేషతో సాధించుకోవచ్చు గనుక, ‘రాజు’ అంటే వెన్నెలలు కాయిం చే చంద్రుణ్ణి కూడా గ్రహించి గొప్ప శ్లేషాలంకారాన్ని కవి ప్రయోగించినట్లు తెలుసుకోవచ్చు. ఈ ఒక్క అలంకారమే గాకుండా ఇంకా రూపకం, అర్థాంతరన్యాసం, వృత్త్యనుప్రా సం, వృత్త్యనుప్రాస గర్భిత క్రమాలంకారం కూడా ఈ పద్యంలో పొదిగిన కవిది అసదృశ ప్రతిభ అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

శోభాయమానమైన పద్యాలు 

అద్దంకి గంగాధర కవి ప్రతిభను తెలిపే ఎన్నో పద్యాలు ఈ కావ్యంలో అడుగడుగు నా కనిపిస్తాయి. ప్రథమాశ్వాసంలో నగర వర్ణన, నాయక వర్ణన చేస్తున్న సందర్భంలో కావ్య నాయకుడైన సంవరుణుని చాలా పద్యాల్లో వర్ణించాడు కవి. అందులో

“సార విభూతి రెండవ 

వృషధ్వజుడాకృతిచే దృతీయ బృం

దాక వైద్యుడిద్ధ శుచితాగుణమందు 

జతుర్థ పావకుం

డారయ భూమి మోచుటకు నైదవ 

దిక్పతి దానరేఖచే

నారవ కల్పవృక్షమున నన్నరపాలుడు మించె గీర్తులన్‌”

అన్న పద్యం ఉంది. ఇదొక విశేషమైన పద్యం. 

పాధారణంగా లోకంలో ఐశ్వర్యవంతుడు ఈశ్వరుడు, అందానికి దేవవైద్యులైన ఇద్దరు అశ్వినీ దేవతలు, నిత్యాగ్నిహోత్రులు నిత్యం ఆరాధించే త్రేతాగ్నులు మూడు, భూభారాన్ని నాలుగు దిక్కుల రక్షించే దిక్పాలకులు, కోరిక కోరికలను తీర్చే మందారం, పారిజాతం, కల్పవృక్షం, హరిచందనం, సంతానమనే ఐదు కల్పవృక్షాలు ఉన్నట్లు భారతీయ పురాణేతిహాసాలు తెలుపుతున్న విషయాన్ని తీసుకుని కవి ఈ కావ్య నాయకుడైన సంవర ణుడు ఐశ్వర్యంలో రెండో శివుడు, సౌందర్యం లో మూడో దేవవైద్యుడు, శుచిత్వ గుణంలో నాలుగో అగ్ని, భూభారకుల్లో ఐదో దిక్పతి, దాన గుణంలో ఆరో కల్పవృక్షమని గొప్పగా ఉత్ప్రేక్షించి కావ్యశోభను ద్విగుణీకృతం చేశాడు. ఇటువంటి ప్రతిభా సమన్వితమైన పద్యాలు ఇందులోని అయిదు ఆశ్వాసాల్లో ఎన్నో చోటు చేసుకున్నాయి.

పంచకావ్యాల్లో ఒకటి

అద్దంకి గంగాధర కవి కవిత్వ పరామర్శ చేసిన సాహితీ విమర్శకులు కీ.శే. వూండ్ల రామకృష్ణయ్య, కీ.శే. పాటింబండ మాధవశర్మ, శ్రీమతి డా. ముదిగంటి సుజాతారెడ్డి, గురిజాల రామశేషయ్య వంటివారు ‘తపతీ సంవరణోపాఖ్యానాన్ని’ అనేక దృక్కోణాలతో విశ్లేషించి పలు విశేషాలంశాలను సాహిత్య ప్రపంచానికి తెలియజేశారు. గంగాధరుని కవిత్వశైలి, రామరాజ భూషణుని ‘వసుచరిత్ర’ శైలీ సదృశంగా ఉంటుందని కొందరు వివరిస్తే, మరి కొందరు ‘ఈ కావ్యం ‘వసుచరిత్ర’కన్నా రెండేళ్లకు ముందే విరచితమైందని కూడా అభిప్రాయపడ్డారు. ఈ కావ్యాన్ని తెలంగాణలో వెలువడ్డ పంచకావ్యాల్లో ఒకటిగా పరిగణిం చవచ్చునన్న ఆలోచనను కూడా వారు వ్యక్త పరిచారు.

శృంగార రస బంధురం

నవరసాల్లో రసరాజంగా కీర్తిని పొందిన శృంగార రస బంధురంగా ‘తపతీ సంవరణోపాఖ్యానా’న్ని తమ ఏలిక అయిన ఇబ్రహీం కుతుబ్‌షా కోరినట్లు ‘వివిధ శృంగార మహిమ’లతో కలిపి అష్టాదశ వర్ణనలు చేసి రచిం చాడు గంగాధర కవి. తనకన్నా పూర్వం ఉన్న శ్రీనాథాది మహాకవుల కావ్యాల అధ్యయనం ఈయన కావ్య మధురిమను మరింత పెం చిందని చెప్పాలి. కేవలం ‘మహాభారతం’లోని ‘ఆదిపర్వం’లో 68 నుంచి 90 వరకు వున్న పద్యాల్లోని కథకు ఇన్ని ఘనతలను జోడించి ఉత్తమ ప్రబంధ స్థాయిని కల్పించ గలిగిన ప్రతిభామూర్తి అద్దంకి గంగాధరుడు. నైషధంలో హంస రాయబారం ఉంటే ఇందులో చిలుక రాయబారాన్ని పెట్టడమే కాకుండా శ్వేన, మయూరాల పోరాటాన్నికూడా నిబద్ధించి కావ్యంలో కొత్తదనాన్ని చూపించే ప్రయత్నం చేసి సఫలీకృతుడైనాడు. పఠితల హృదయాలను అలరించే విధంగా రచన సాగించిన గంగాధరుడు తన వ్యుత్పన్నతకు కారణాన్ని చెబుతూ, ఇంతటి శక్తి రావడానికి కారణభూతులైన పూర్వకవులను స్తుతించా డు. ఈ నవసర బంధుర కావ్యరచనకు పూనుకోవడానికి కావలసిన శక్తికి పూర్వకవుల మహా రచనలే కారణమని ఘంటాపథంగా చెప్పాడు. శాస్త్ర పాండిత్య స్ఫోరకాలైన గొప్పగొప్ప పద్యాలు, ధారాశుద్ధి గలిగి, విశేష సమాస ఘటనతో ఉన్నత శ్రేణిలో రచన కొనసాగించాడు.

“పాటీణాచల హాటకక్షితిధర 

ప్రాక్పశ్చిమ క్షోణి భృ

ద్వాటీకూట గుహానిబద్ధ నినద 

ద్రాఘిష్ఠశారాంగాయుధా!

ఘోటీకోటి రథచ్ఛటా గజఘటా 

గుంజద్భటాళీ సమి

ద్ధాటీ దుందుభి భాంక్రియా బధిరత 

ద్యావా పృథివ్యంతరా!”

ఇటువంటి ఘనమైన పద్యాలు కావ్యంలో అనేక సందర్భాల్లో కనిపిస్తాయి. ‘తపతీ సంవరణము’గా కూడా పిలిచే ఈ కావ్యం గొప్ప శృంగార రస ప్రబంధమని సాహితీవేత్తల నిశ్చితాభిప్రాయం. ఇందులోని ఎన్నో శబ్దా లు నిఘంటువులలో కూడా చోటు చేసుకోలేనంత అధికంగానే కనిపిస్తాయి. శృంగారం అంగిరసంగా, వీరం అంగరసంగా ఉండి తెలుగు సాహిత్యానికే వెలుగు తెచ్చిన అద్దంకి గంగాధరుని ‘తపతీ సంవరణోపాఖ్యానము’ సాహితీ ప్రియుల పాలిటి కల్పవృక్షం.

-గన్నమరాజు గిరిజా మనోహరబాబు , 9949013448